BRS Manifesto: బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో మైండ్‌బ్లాంక్‌ అయ్యే పథకాలు

కాంగ్రెస్‌ గ్యారెంటీ స్కీమ్‌లు.. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే పథకాలతో జోరు చూపిస్తుండటంతో అధికార బీఆర్‌ఎస్‌ కూడా అలర్ట్‌ అవుతోంది.

special schemes for women in brs party manifesto

BRS Party Manifesto: మహిళలు మహారాణులు.. ఓట్ల యుద్ధంలో కూడా మహిళామణులదే ఆధిపత్యం. ఆడవారి ఆశీస్సులే అధికార పీఠానికి దగ్గర చేస్తుందని నేతల నమ్మకం.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల మద్దుతు కోసం పార్టీలు పోటీపడుతున్నాయి. ప్రత్యేక పథకాలతో హోరెత్తిస్తున్నాయి. ఆరు గ్యారెంటీ స్కీమ్‌ల్లో కాంగ్రెస్‌ మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వగా.. ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న బీఆర్‌ఎస్‌.. తన మ్యానిఫెస్టోలో మరిన్ని పథకాలకు చోటిస్తున్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీలు మహిళలపైనే నమ్మకం పెట్టుకుంటుండటంతో అనేక కొత్త పథకాలు తెరపైకి వస్తున్నాయి. ఏ పార్టీ ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుందో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణలో పార్టీలు ఓట్ల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా.. ఓట్ల వేటకు పావులు కదుపుతున్నాయి. ఎన్నికల్లో విజయావకాశాలను నిర్దేశించే వర్గాలను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తూ.. పథకాలు ఎరవేస్తున్నాయి. మహిళల ఓట్లకు గాలం వేస్తున్న పార్టీలు.. వారికి ప్రాధాన్యమిచ్చే వివిధ పథకాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 ఓట్లు ఉండ‌గా… ఇందులో మ‌హిళా ఓట‌ర్లే కోటి 58 లక్షల 43 వేల 339 మంది. మొత్తం ఓట్లలో దాదాపు సగం మంది మహిళా ఓటర్లే కావడంతో వీళ్లే ఎన్నికల్లో కీలకం కానున్నారు. అంతేకాకుండా పురుష ఓటర్ల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండటంతో వారి ఓట్లు దక్కించుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు.

ఎన్నికల్లో వివిధ వర్గాలను ఆకర్షించే పనిలో కాంగ్రెస్‌ కాస్త ముందంజలో కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో వెనకబడిన కాంగ్రెస్‌ వర్గాల వారీగా ప్రత్యేక డిక్లరేషన్‌లతోపాటు ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను ప్రకటించింది. గ్రామస్థాయి నుంచి ఈ పథకాలకు విస్తృత ప్రచారం జరిగింది. కర్ణాటక ఫార్ములాతో కాంగ్రెస్‌ ప్రకటించిన మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ పథకం కింద మ‌హిళ‌ల‌కు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయ‌లు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా వంటింటి కష్టాలు తీరేలా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్‌ పంపిణీ చేస్తామనే మరో హామీ మహిళలను ఆకర్షిస్తోంది.

ఇదే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తీవ్ర చర్చకు తెరలేపింది. ఈ హామీలతోపాటు మ్యానిఫెస్టోలో మరిన్ని మహిళా పథకాలను జోడించేందుకు ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌. ప్రస్తుతం అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి కౌంటర్‌గా ఆ పథకం కింద ఇచ్చే మొత్తానికి లక్ష రూపాయలకు పెంచాలనే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్‌.. అదేవిధంగా ఇదే పథకంలో అర తులం బంగారం పెళ్లికానుకగా ఇచ్చే చాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతోంది.

Also Read: ఆశలు వదులుకున్న వైఎస్ షర్మిల.. పాలేరుతో పాటు మిర్యాలగూడ నుంచి పోటీ?

కాంగ్రెస్‌ గ్యారెంటీ స్కీమ్‌లు.. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే పథకాలతో జోరు చూపిస్తుండటంతో అధికార బీఆర్‌ఎస్‌ కూడా అలర్ట్‌ అవుతోంది. ఈ నెల 15న ప్రకటించే మ్యానిఫెస్టోలో మైండ్‌బ్లాక్‌ అయ్యే రీతిలో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఒంటరి మహిళలకు ఇస్తున్న పింఛన్‌ మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌ హామీలకు దీటుగా ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ సాయం పెంపు వంటివాటిని సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీకి ప్రతిగా ఏ హామీ ఇవ్వాలన్నదానిపై బీఆర్‌ఎస్‌ వ్యూహకర్తలు చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా పలువురు కలెక్టర్లు, ఎస్పీల బదిలీ

మొత్తానికి ఇటు కాంగ్రెస్‌.. అటు బీఆర్‌ఎస్‌ పోటాపోటీగా మహిళల కోసమే ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడం హాట్‌టాపిక్‌ అవుతోంది. కాంగ్రెస్‌ హామీలపై ఇప్పటికే ప్రచారం జరగడంతో అంతా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో ఎవరూ ఊహించని పథకాలను ప్రవేశపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కారు పార్టీ.. ఈ సారి మహిళల ఓట్ల కోసం ఎలాంటి కొత్త పథకం ప్రవేశపెడుతుందోననే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.