తెలంగాణ అసెంబ్లీ : 6 అడుగుల భౌతిక దూరం, అసెంబ్లీలో 40 సీట్లు, మండలిలో 8 సీట్లు అదనం

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభా ప్రారంభంకాగానే… మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి సభ్యులు సంతాపం తెలుపనున్నారు. ఈ మేరకు సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.
ప్రశ్నోత్తరాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి రద్దు చేయడంతో.. రేపటికి వాయిదా వేసే అవకాశముంది. సంతాప తీర్మానం తర్వాత… బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ, మండలి అజెండా, పని దినాలను బీఏసీ ఖరారు చేయనుంది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. అందుకోసం అసెంబ్లీ, మండలిలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో సభ్యులు 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా.. అసెంబ్లీలో అదనంగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు కేటాయించారు. సభ్యులంతా విధిగా మాస్క్ ధరించాలనే షరతు విధించారు.
సమావేశాల ప్రారంభానికి ముందే అందరికీ కరోనా పరీక్షలు చేశారు. నిన్న కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావుకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. మరింత అప్రమత్తమైన అసెంబ్లీ అధికార యంత్రాంగం సభ్యులందరికీ పరీక్షలు చేస్తోంది. నెగెటివ్ వచ్చిన మారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు.
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం జాబితాను సిద్ధం చేసింది. గతంలో తెచ్చిన పలు ఆర్డినెన్సుల స్థానంలో ప్రభుత్వం బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది.
ఇక సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన రెవెన్యూ చట్టంపై ప్రభుత్వం దాదాపు రెండేళ్లుగా కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది. దీంతో ఈ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టాన్ని ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుకోవడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో…. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీన్ని కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రైతుల కోసం ఒక కొత్త పథకాన్ని కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మంచినీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సర్కార్ సభలో ప్రకటించే అవకాశముంది. వెనుకబడిన వర్గాల జాబితాలో 17 లేదా 18 కులాలను చేర్చేందుకు కూడా సర్కార్ సిద్ధమవుతోంది.
అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇటు పోలీసులు కూడా అసెంబ్లీ సమావేశాలకు భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ భద్రత కల్పిస్తున్నారు. దాదాపు 600మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, మండలి పరిసర ప్రాంతాల్లో మూడంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.