Chalo Medigadda
CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశాలు ఐదోరోజు ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యాయి. సభలో ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ఇవాళ మేడగడ్డ బ్యారేజ్ సందర్శనకు ప్రభుత్వం అన్ని పార్టీల సభ్యులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. గంట పాటు సభ నిర్వహణ అనంతరం సీఎం రేవంత్, మంత్రులు సహా కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాజెక్టుల సందర్శనకు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. అంతకుముందు అసెంబ్లీలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారు. 14 లక్షల ఎకరాల సాగుకోసం వైస్సార్ హయాంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారు. తెలంగాణ వచ్చాక.. రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : Chalo Medigadda : మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు.. అక్కడే ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
గత ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ లు ఏర్పాటు చేశారు. మేడిగడ్డ కుంగిపోయింది. గత ప్రభుత్వం.. ఇసుక కదిలింది బ్యారేజ్ కుంగింది అన్నారు. ఇసుక మేడలు కట్టారు. కుంగిపోయిన బ్యారేజ్ ను ఎవరు చూడకుండా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ఫైల్స్ మాయం కాకుండా అన్నిస్వాధీనం చేసుకోవాలని, విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చాం. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. కాళేశ్వరం విషయంలో అక్కడ ఏం జరిగిందనేది అందరు సభ్యులు తెలుసుకోవాలని భావించాం. అందుకే వారిని ప్రత్యేక బస్సుల్లో ప్రభుత్వమే తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశామని రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. ఇప్పటికే అందరికి మంత్రి ఉత్తమ్ లేఖలు రాశారు. అందరూ వెళ్లి చూద్దాం.. రేపు, లేదా ఎల్లుండి సభలో చర్చిద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రపంచంలో అద్భుతం అని న్యూయార్కులో కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరణ చేశారు. తాజ్ మహల్ వంటి అద్భుతాన్ని అందరూ వెళ్లి చూద్దాం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. హరీష్ రావు, కడియం శ్రీహరి వంటి అనుభవం కలిగిన వారు వచ్చి ఆ అద్భుత ప్రాజెక్టును మాతో వచ్చి చూడాలి. గత గవర్నర్, హరీష్ రావును కాళేశ్వరరావు అని పేరు పెట్టారు.. ఆయన రావోచ్చు. కేసీఆర్ కోసం బేగంపేట్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా హెలికాప్టర్ సిద్ధంగా ఉందని రేవంత్ అన్నారు. అనంతరం సభ రేపు 10 గంటలకు వాయిదా పడింది. సభ అనంతరం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు.
ఒకే బస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు బయలుదేరగా.. నాలుగు బస్సుల్లో ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లారు.
మేడిగడ్డ సందర్శనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దూరంగా ఉన్నారు. భట్టి సోదరుడు వెంకటేశ్వరరావు (70) మృతి చెందారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోదరుడి అత్యక్రియలకు హాజరుకానున్న నేపథ్యంలో మేడిగడ్డ పర్యటనకు భట్టి దూరంగా ఉన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టులో కూలిపోయిన పిల్లర్లను పరిశీలించి, ప్రజలకు వివరించేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు అధికారుల బృందం.#KaleshwaramProject pic.twitter.com/MJQmFWSSg7
— Telangana Congress (@INCTelangana) February 13, 2024