Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు.. Live.. హరీశ్‌రావుపై స్పీకర్ ఆగ్రహం
Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరయ్యారు.
- Harish Thanniru
- Updated on- September 8, 2026 / 11:22 AM IST
Telangana Assembly Sessions
Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరయ్యారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌తో ఎమ్మెల్యే హరీశ్ రావు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ సైతం ఘాటుగా స్పందిస్తూ.. మీరు లొల్లి పెడితే భయపడేది లేదంటూ వ్యాఖ్యానించారు. ఎందుకంత ఆవేశం. మీకు కాదు ఆవేశం.. నాకు ఉండాలి. నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారని భావోద్వేగానికి గురయ్యారు. తాతా మధుపై చర్యలకు కాంగ్రెస్ పట్టుబడుతుండగా.. బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని.. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
Read Also – తాతా మధు అరెస్ట్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్.. మేము సిద్ధం.. మీరు సిద్ధమా? కాంగ్రెస్‌కు సవాల్..
శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. స్పీకర్ ను బెదిరించేలా బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందని అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు.. స్పీకర్ పై బెదిరింపు ధోరణితో సభ నడవదని గుర్తించుకోవాలి. సభను ఎలా నడపాలో మీరు ఎలా చెబుతారు..? అంటూ శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మహిళా సభ్యుల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పినా పట్టించుకోవట్లేదు.. స్పీకర్ పట్ల దుర్భాషలాడిన విషయాన్ని పక్కన పెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు చెబుతున్నారు. స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడితే తప్పని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందని శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పకుండా బీఆర్ఎస్ సభ్యులు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటే వ్యక్తిగతంగా మాకు గౌరవం. స్పీకర్ ను బీఆర్ఎస్ గౌరవిస్తుంది. స్పీకర్ ను ఉద్దేశించి అనలేదని తాతా మధు చెప్పారు. అలా భావించి ఉంటే లిఖిత పూర్వకంగా విచారం వ్యక్తం చేశాడు. అదే విషయంపై మేము విచారణ వ్యక్తం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది. దళిత గిరిజనులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఎందుకు వెయ్యలేదు? మూడేళ్లు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.
