Telangana Bandh
BC Bandh : స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా బీసీ ఐకాస ఇవాళ రాష్ట్ర బంద్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. బీసీ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం టీజేఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసి, గిరిజన, మైనార్టీ సంఘాలతో పాటు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చారు. బంద్ సందర్భంగా బీసీ సంఘాల నేతలు తెల్లవారు జామునే రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు.
ఉదయాన్నే ఆయా జిల్లాల్లోని బస్ డిపోల వద్ద బీసీ సంఘాల నేతలు బైటాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ సందర్భంగా హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్ వద్ద బీసీ నాయకులు ఆందోళనకు దిగారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వద్ద బస్సులు నిలిచిపోయాయి. బస్ స్టేషన్ ఆవరణలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు.
Also Read: Mla Anirudh Reddy: నేను కూడా సీఎం అభ్యర్థి అవుతా.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎంజీబీఎస్ ఎగ్జిట్ గేట్ వద్ద బస్సులు బయటికి వెళ్లకుండా బీసీ నేతలు అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారు. ఉదయం 9 గంటలకు ఎంజీబీఎస్ వద్ద మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ యాదవ్ తదితరులు బీసీ బంద్‌కు మద్దతు తెలిపి బంద్‌లో పాల్గొననున్నారు. ఎనిమిదిన్నర గంటలకు ఎంజీబీఎస్ కి చేరుకొని బీసీ బంద్‌కు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలపనున్నారు. బంద్ సందర్భంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి.