Telangana Budget: తెలంగాణ బడ్జెట్.. రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్

అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రూ.3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Telangana Budget

Telangana Budget 2025-26: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రూ.3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా చూపించారు. అయితే, ఈ బడ్జెట్ లో రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది.

Also Read: Telangana Budget 2025: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..

ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రేవంత్ సర్కార్ రూ. 24వేల439 కోట్లు కేటాయించింది. అయితే, రైతు భరోసా పథకానికి బడ్జెట్ లో రూ.18వేల కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎకరాకు ఏడాదికి రూ.12వేలను రెండు విడుతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా నిధులను రైతులకు అందిస్తామన్నారు. ఇప్పటికే మూడు ఎకరాలలోపు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 44.82లక్షల మంది రైతులకు చెందిన 58.13లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద రూ.3,487.82 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా బడ్జెట్ లో రైతు భరోసాకు 18వేల కోట్లు కేటాయించడంతో రేపోమాపో రైతు భరోసా అర్హులైన లబ్ధిదారులకు అందనుంది.

Also Read: Telangana Budget: తెలంగాణ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు కేటాయింపులు ఇలా..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సన్న వడ్లు పండించే రైతులకు ప్రతి క్వింటాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. తాజాగా.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సన్న వడ్లకు బోనస్ చెల్లింపు వివరాలను వెల్లడించారు. సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ చెల్లించడం వల్ల గత ఖరీఫ్ తో పోల్చితే ఈసారి సన్న వడ్ల సాగు 25లక్షల ఎకరాల నుంచి 40లక్షల ఎకరాలకు పెరిగిందని అన్నారు. గత ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 8,332 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సన్న వడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రూ.1206.44 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. అయితే, ఈ బడ్జెట్ లో సన్నాలకు బోనస్ కు రూ.1800 కోట్లు కేటాయించారు.

 

రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంటలను పండించే రైతులకు ప్రోత్సహించడం కోసం సబ్సిడీల రూపంలో వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, అలాగే, ఉద్యానవన పంటల సాగులో డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించే వారు సౌర విద్యుత్ ఉపయోగించుకునేలా సబ్సిడీలు అందిస్తున్నట్లు తెలిపారు.