తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైందా? చాలాకాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? ఈ సారి క్యాబినెట్ విస్తరణ సమీకరణాలు మారిపోయాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ సారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిందట. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై కన్‌క్లూజన్‌కు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. మార్చి 30న మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్యాబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారట. నల్గొండ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ పక్కా అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు ఇచ్చినప్పుడు అధిష్టానం ఆయనకు హామీ ఇచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెర్తుకు ఎసరు?
మరి అదే జరిగితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెర్తుకు ఎసరు వస్తుందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. గతంలోనూ రాంరెడ్డి దామోధర్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్రెడ్డిలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలానే రొటేట్ చేస్తూ ఛాన్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు దాదాపు బెర్తు ఖాయమై పోయిందనే టాక్ నడుస్తోంది. ఇక మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్ ఆలీఖాన్‌కు కూడా మైనార్టీ కోటాలో అవకాశం ఉండనున్నట్లు చెబుతున్నారు.
ఇక లేటెస్ట్‌గా ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కించుకున్న అద్దంకి దయాకర్, విజయశాంతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. విజయశాంతికి బీసీ మహిళా కోటాలో ఇవ్వాలని ఏఐసీసీ ఆలోచన చేస్తుందట. రాములమ్మకు అవకాశం ఇవ్వాలనుకుంటే..ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మహిళా మంత్రుల్లో ఒక్కరికి ఉద్వాసన పలుకుతారని అంటున్నారు.
విజయశాంతి స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం కావడం..అదే జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు ఆల్ రెడీ కేబినెట్ తో ఉండటంతో వారిలో ఒకరికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. . ఇక అద్దంకి దయాకర్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అద్దంకి కి ఛాన్స్ దక్కితే..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు నిరాశ తప్పదు. అద్దంకి, వివేక్ లలో ఒకరికి పక్కాగా క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందట.
క్యాబినెట్ బెర్త్ కోసం ఎదురుచూపులు
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం దక్కకపోతే.. అదే సామాజికవర్గానికి చెందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావుకు ఇస్తారని అంటున్నారు. మదన్‌మోహన్ కాకపోతే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మెదక్ కోటాలో మైనంపల్లి రోహిత్ పేర్లు కూడా ప్రచారంలో వినిపిస్తున్నాయి. ఇక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కూడా క్యాబినెట్ బెర్త్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కేబినెట్ లో ఉంటే మాత్రం సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ లేనట్లే. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీనియర్‌నేత మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రిపదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కూడా అమాత్య రేసులో ఉండటంతో..ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ పక్కానే. గ్రేటర్ పరిధిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్ రెడ్డి కావడం… ఆయన కాంగ్రెస్ లో ఎప్పటినుండో ఉండటం కలిసిరావచ్చు. అన్నీ అనుకున్నట్లు కుదురితే..తెలుగు సంవత్సరం ఉగాది రోజున తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఖాయమే.