తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేకులా? ఈ ట్విస్ట్‌లేంటి?

మొత్తం మీద రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.

CM Revanth Reddy

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. థ్రిల్లర్ సినిమాను మించిన సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తోంది. ఇదిగో లిస్ట్.. అదిగో ముహూర్తం ఉంటూ ఊరిస్తున్నారు తప్పా.. పదవులు పంచింది లేదు. ప్రమాణస్వీకారం చేయించింది లేదు. మంత్రివర్గ విస్తరణ ప్రాసెస్ క్లైమాక్స్‌ చేరుకున్నాక ఏదో ఒక ట్విస్ట్‌ అడ్డొస్తోంది. ఏప్రిల్ 3న విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నా వర్క్ అవుట్ కాలేదు. తాజా పరిణామంపై కాంగ్రెస్‌లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈసారి సామిజిక సమీకరణల రూపంలో బ్రేకులు పడ్డాయనే గాసిప్ వినిపిస్తోంది.?

ఒకటే టెన్షన్.. సినిమాను తలపించే ఉత్కంఠ.. అనేక మలుపులు.. ఎన్నో డిమాండ్‌లు.. రోజుకో కొత్త పేరు.. సామాజిక కోణాలు ఇలా ఒక్కోసారి ఒక్కో అంశంతో వాయిదా పడుతూ వస్తోంది తెలంగాణ క్యాబినెట్ విస్తరణ. 3న క్యాబినెట్ విస్తరణ పక్కా అంటూ ఉగాది ముందు వచ్చిన లీక్‌లతో ఆశావాహులు ఆశల పల్లికిలో ఊగిపోయారు.. కానీ ఆ మూహుర్తం కూడా మించిపోవడంతో వారంతా డీలాపడిపోయారట.

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కూడా అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయ్. ఏడాదిన్నర కాలంగా వాయిదాలతో సరిపెట్టుకుంటూ వస్తున్న విస్తరణ ఈసారి ఖచ్చితంగా చేసి తీరాలని సీఎం రేవంత్‌తో పాటు ఏఐసీసీ నేతలు కూడా డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ 3న ముహూర్తం కూడా పెట్టారు.. ఆశావహుల జాబితాను వడబోసి నలుగురి పేర్లను ఫిక్స్ చేశారు. ఇక ప్రమాణస్వీకారమే ఆలస్యం అన్నారు.. కానీ క్లైమాక్స్‌లో విస్తరణకు మళ్లీ బ్రేక్ పడింది.

పదవులు ఆశించిన నేతలు ఒక్కసారిగా అలర్ట్
అయితే ఈసారి విస్తరణకు బ్రేకులు పడటానికి కారణాలపై గాంధీభవన్‌లో రకరకాల చర్చ జరుగుతోంది. క్యాబినెట్ బెర్త్ ఖాయమైందని పలువురు పేర్లు తెరపైకి రావడంతో.. పదవులు ఆశించిన నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మంత్రివర్గంలో సామాజిక సమతుల్యం పాటించాలంటూ.. ముఖ్యంగా తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగ వర్గానికి చోటు కల్పించాలంటూ ఆ వర్గం ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. ఇటు లంబాడ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సైతం.. తమకు క్యాబినెట్‌లో ఛాన్స్ కల్పించాలనే డిమాండ్‌ను హైకమండ్‌ ముందు పెట్టారు.

ఇక గ్రేటర్ పరిధిలో ఒక్కరికైనా మంత్రివర్గంలో చాన్స్ కల్పించాలంటూ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు పోరు చేస్తున్నారు. మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ సీనియర్ నేత జానారెడ్డి సైతం కేంద్రానికి లేఖ పంపించారు.. మరో సీనియర్ నేత దొంతి మాధవ రెడ్డి సైతం మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇలా ఎన్నో చిక్కుముడులు విస్తరణకు అడ్డుపడ్డాయని గాంధీభవన్‌లో వినిపిస్తున్న టాక్.

ప్రస్తుతం తెలంగాణలో మంత్రివర్గంలో ఆరుబెర్తులు ఖాళీగా ఉన్నాయి.. వీటిలో నాలుగు బెర్తులను ఫిలప్ చేయాలని హైకమాండ్ డిసైడ్ అయ్యిందట. ఆ నాలుగు బెర్తుల కోసం ప్రచారం జరుగుతున్న పేర్ల విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయట. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.

గడ్డం వివేక్ మాల సామాజిక వర్గం కావడం.. అందులోనూ వారి కుటుంబంలో వాళ్ల సోదరుడు ఎమ్మెల్యేగా, కొడుకు ఎంపీగా ఉండడంతో.. ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు సంధిస్తున్నారట కాంగ్రెస్ నేతలు. మాల సామాజిక వర్గం కాకుండా మాదిగ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వాలంటూ మరో డిమాండ్‌ కూడా గాంధీభవన్‌లో రీసౌండ్ చేస్తోంది.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా సామాజిక సమీకరణ అంశాలను తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే వాళ్ల సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో.. మళ్లీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఎలా ఇస్తారంటూ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంతేకాదు రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే ఒకే జిల్లా నుంచి ముగ్గురు రెడ్లు మంత్రి పదవుల్లో ఉంటారు. ఈ పరిణామం కూడా పార్టీకి ఇబ్బందులు తెచ్చే అవకాశముందని టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.

మొత్తం మీద రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. వరుసగా ఎదురవుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆచితుచి వ్యవహరించే ధోరణిని అవలంభిస్తోంది. మంత్రివర్గ విస్తరణను.. గుజరాత్‌లో జరిగే ఏఐసీసీ సమావేశాల తర్వాత ఏప్రిల్ రెండో వారంలో చూడాలని భావిస్తుందట. చూడాలి ఏప్రిల్ రెండో వారంలోనైనా ఉంటుందో లేదో..