Telangana Cabinet Meeting : మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ అత్యసవరంగా భేటీ కానుంది.

Telangana Cabinet Meeting : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ అత్యసవరంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా..?… లేకుంటే నైట్ కర్ఫ్యూ విధించాలా..?… అనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తితో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

రైతులకు రైతుబంధు డబ్బులు చేతికొస్తుండటంతో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచటం, నాణ్యమైన విత్తనాలను అందించడంపై దృష్టి పెట్టనున్నది. ప్రత్యామ్నాయ పంటల సాగుతోపాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటడంపైనా చర్చించే అవకాశం ఉన్నది.

కాగా.. నిన్న కూడా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులతో సమావేశం అయ్యారు. మంత్రులు హరీశ్‌రావు, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు హాజరైన ఈ సమావేశంలో లాక్ డౌన్ సడలింపులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలతో పాటు హుజూరాబాద్ అభ్యర్థిపై కూడా కీలకంగానే చర్చించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఈ రోజుతో లాక్‌డౌన్‌ ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మంత్రివర్గ భేటీ అనంతరం చేయబోయే ప్రకటన ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు