Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ తరువాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై పొంగులేటి మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పొంగులేటి చెప్పారు.
15వ ఆర్థిక సంఘం కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో ముగియనుంది. అప్పటిలోగా ఎన్నికలు పూర్తికాకపోతే గ్రామాలకు రావాల్సిన దాదాపు రూ.3వేల కోట్ల నిధులు కోల్పోతాం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి చెప్పారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ , వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానించిందని పొంగులేటి అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చిన తరువాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని పొంగులేటి చెప్పారు.
♦ అందెశ్రీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.
♦ అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు చేయడంతోపాటు.. పాఠ్య పుస్తకాల్లో అందెశ్రీ రాసిన తెలంగాణ గీతం పొందుపర్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
♦ తెలంగాణ ప్లాట్ ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
♦ ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్2 మెయిన్ కెనాల్‌కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదించింది.
♦ ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను మల్టీ యూజ్ జోన్స్‌గా మార్చేందుకు రూపొందించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
♦ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
♦ సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.