Telangana Cabinet Decisions: ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

6 నెలల తర్వాత మరో డీఏ చెల్లిస్తామని తెలిపారు.

Telangana Cabinet Decisions: తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం సాగింది. ఈ సమావేశంలో ఉద్యోగులకు డీఏ, ఆరోగ్య భద్రత, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించారు. మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ఉద్యోగుల డిమాండ్లపై క్యాబినెట్ లో సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తక్షణమే ఒక డీఏను చెల్లిస్తామన్నారు. 6 నెలల్లో రెండో డీఏను ఇస్తామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు 48 గంటలు క్రిటికల్- దాసోజు శ్రావణ్

ఉద్యోగుల హెల్త్ కార్డ్ విషయంలో ప్రతి ఉద్యోగి నెలకు 500 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వమూ కొంత మొత్తం జమ చేస్తుందన్నారు. ఈ మొత్తంతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలను నెలల వారీగా క్లియర్ చేస్తామన్నారు. నెలకు రూ.700 కోట్లకు తగ్గకుండా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని మంత్రులు ప్రకటించారు. ఎన్నికల సమయంలో చేసిన ఉద్యోగుల బదిలీలను వెనక్కి తీసుకొస్తామన్నారు. అంగన్ వాడీ ఉద్యోగుల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ను రూ.2లక్షల వరకు పెంపు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
* ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని నిర్ణయం
* తక్షణమే ఒక డీఏ చెల్లింపు, 6 నెలల్లో రెండో డీఏ చెల్లింపు
* ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్
* ఉద్యోగులకు నెలకు 700 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు చెల్లింపు
* నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
* ములుగులో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపు
* ప్రతి గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణం
* ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా నుంచి హైదరాబాద్ వరకు 4 లేన్ల రోడ్డు, లింక్ రోడ్లు నిర్మాణం
* మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ప్రమాద బీమా చెల్లింపునకు నిర్ణయం
* బృంద సభ్యులు మరణిస్తే రూ.10లక్షలు
* అంగన్ వాడీ ఉద్యోగుల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ రూ.2లక్షలకు పెంపు
* ఎన్నికల సమయంలో చేసిన ఉద్యోగుల బదిలీలు వెనక్కి