డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. చెన్నైలోని అళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసంలో ఇవాళ(మే-13,2019) వీరి భేటీ జరిగింది. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ ఎస్ తరపున ఎంపీలు వినోద్ కుమార్, సంతోశ్ కుమార్ లు పాల్గొన్నారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు.ఇటీవల కేరళ సీఎం పిన్నరయి విజయన్ తో కూడా కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. తమిళనాడులో పోలింగ్ సరళి గురించి ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.ఈ నెల 23 తరువాత కేంద్రంలో ఏర్పాటుకాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని, ప్రాంతీయపార్టీల దగ్గరకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని భేటీ సందర్భంగా కేసీఆర్ డీఎంకే అధినేతకు వివరించినట్లు తెలుస్తోంది.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా గతేడాది అప్పటి డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్ తో కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. త్వరలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సందర్భంగా మరోసారి స్టాలిన్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది.