Indiramma Indlu: గుడ్ న్యూస్.. ‘ఇందిరమ్మ ఇండ్లు’ జనావాసాల పరిధిలోనే.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu)ప్రజల పని ప్రదేశాలకు, ఉపాధి కేంద్రాలకు సమీపంలోనే ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.
- V Santhosh Kumar
- Published on- July 24, 2026 / 07:11 PM IST
Telangana cm revanth reddy orders indiramma housing site acquisition in cure hyderabad
- హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు
- నగరంలోనే పేదలకు సొంతిల్లు
- రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ
Indiramma Indlu: హైదరాబాద్ మహానగర పరిధిలోని పేద వర్గాలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజల పని ప్రదేశాలకు, ఉపాధి కేంద్రాలకు సమీపంలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఊరికి చివరన ఇళ్లు నిర్మిస్తే లబ్ధిదారులు ఉపాధి కోల్పోయి ఆ ఇండ్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడిన సీఎం, ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను తక్షణమే గుర్తించి గృహ నిర్మాణానికి సేకరించాలని సూచించారు.
Jupally Krishna Rao: కాన్వాయ్ ఆపేసి.. ప్రాణాన్ని కాపాడి.. మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి
528 చదరపు అడుగుల విస్తీర్ణం – రూ.5 లక్షల సబ్సిడీతో సొంతిల్లు:
ఈ ప్రాజెక్టు కింద నిర్మించే ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనగా 400 చ.అడుగుల కార్పెట్ ఏరియా ఉండనుంది. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కాగా, ల్యాండ్ కాస్ట్‌ను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ రూ.5 లక్షల సబ్సిడీని అందిస్తోంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. స్థలాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, ఇళ్ల(Indiramma Indlu) నిర్మాణ పనులను త్వరగా పట్టాలెక్కించాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
తొలి దశలో 17 నియోజకవర్గాలు – 7,680 ఫ్లాట్ల నిర్మాణం:
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం తొలి దశలో క్యూర్ పరిధిలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మేడ్చల్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇబ్రహీంపట్నం సహా మొత్తం 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు నిర్మించనున్నారు. స్థలాలను కోల్పోయే పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు ప్రత్యామ్నాయంగా వేరే చోట భూములు కేటాయిస్తారు. ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
