CM Revanth Reddy
CM Revanth Reddy : మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని, వారికి బ్రహ్మాండమైన కాలనీలు కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీపై ప్రశ్నోత్తరాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
మూసీ అనంతగిరి నుంచి వాడపల్లి వరకు ప్రవహిస్తుంది. మూసీ-ఈసా రెండు నదుల కలయిక. బాపూఘాట్ రెండు నదుల సంగమం. నదుల పరివాహంలోనే నాగరికత, పట్టణాలు అభివృద్ధి జరిగింది. వరదల నివారణ, త్రాగునీరు కోసం నాడు నిజాం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారు. లాఖోంకి దావా అనంతగిరి కొండలు.. అక్కడి వన మూలికలు ఎంతో విలువైనవి. అక్కడి నుండే మూసీ పుట్టిందని సీఎం రేవంత్ అన్నారు.
ఫామ్‌హౌస్‌లు కట్టి మూసీని కలుషితం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. నదీ పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసిన చాలా ప్రాంతాలను చూస్తున్నాం. సబర్మతి నదిని పునరుద్ధరణకోసం 60వేల కుటుంబాలను తరలించారు. గంగా ప్రక్షాలన కోసం అక్కడి బీజేపీ ప్రభుత్వం అదే చేసింది. సబర్మతి, గంగా అభివృద్ధిలను కాంగ్రెస్ ఎప్పడూ వ్యతిరేకించలేదని రేవంత్ అన్నారు. నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు. ఆక్రమించుకుని కలుషితం చేశారు. పట్టణ మురికిని ముసీలోకి తరలించి కలుషితం చేశారు. ఈ కలుషితంను నల్గొండ ప్రజలకు శాపంగా మార్చారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ కలుషితంతో అడ పిల్లలు గర్భం దాల్చలేకపోతున్నారని డాక్టరు రిపోర్టులు ఉన్నాయి. నల్గొండ ప్రజలు దుర్భరమైన బతుకులు బతుకుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేయాల్సిందే అని నిర్ణయించాం. దాని అభివృద్ధి కోసం గ్లోబల్ కంపెనీలను ఆహ్వానించామని రేవంత్ రెడ్డి చెప్పారు.
రెండు ఫేస్‌లో మూసీ నదిని అభివృద్ధి చేస్తాం. ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్. మార్చి 31లోపు మొదటి ఫేజ్ పనులను ప్రారంభిస్తాం. మూసీ పొడుగునా ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుచేస్తాం. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మూసీ అభివృద్ధి చేస్తామని సీఎ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీ కాదు ఒర్జినల్ సిటీ అని అభివృద్ధి చేసి చూపిస్తాం. గత ప్రభుత్వం మాదిరి మేము ఓల్డ్ సిటీని నిర్లక్ష్యం చేయమని అన్నారు. రియల్ ఎస్టేట్ .. అదో రంగం. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి రియల్ ఎస్టేట్ ఎంతో కీలకమని రేవంత్ పేర్కొన్నారు.
ఈ మనుషుల్లో విషం నింపుకున్నారు. మూసీలోని కలుషితం కంటే ప్రమాదకరం. మూసీపై నిజాలు చెబుతుంటే.. తట్టుకోలేక పోతున్నారంటూ బీఆర్ఎస్ సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారి విషపు చూపులు ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ , లక్ష్మారెడ్డి లను చూసి నేర్చుకోండి. వారు మూసీని అభివృద్ధి చేయమని కోరారు. మూసీ అభివృద్ధి చేయాలా వద్దా.. సూచనలు చేయండి. అంతే కానీ మీ కడుపు మంటను చూపకండి అని రేవంత్ హితవు పలికారు.
మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం. వారికి బ్రహ్మాండమైన కాలనీలు కట్టిస్తాం. వారికి ఉద్యోగ, విద్య, ఉపాది అవకాశాలు ఇస్తాం. అడ్డుకునే వారు.. ఆ మూసి దగ్గరపై ఉండమనండి.. కాలే శవాలు, కాలుష్యం మధ్య ఒక్క రోజు ఉంటే తెలుస్తుంది. మంచిరేవుల దగ్గర 800 ఏళ్ల శివాలయం ఉంది. నది పరివాహకంలో గుడి, మజీద్, గురుద్వార్, చర్చ్‌లను నిర్మిస్తాం. మూసీపై డీపీఆర్‌ను అసెంబ్లీలో పెడతా. అందరి సలహాలు సూచనలు తీసుకుంటా. ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం పెడతాం. కేంద్రాన్ని కోరాం.. రాజ్ నాథ్ సింగ్ అంగీకరించారని సీఎం రేవంత్ తెలిపారు.
మూసీని అడ్డుకోకండి.. అక్కడి పేదలకు ఏం చేయాలో చెప్పండి. ప్రభుత్వాన్ని ఎలాంటి రహస్య ఎజెండాలేదు., మంచి పనిచేయాలనదే ప్రభుత్వ లక్ష్యం. మూసీ డీపీఆర్ వచ్చాక.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తాం. అందరు ఎమ్మెల్యేలకు పిపిటితో వివరిస్తాం. ఆరోపించేవాళ్ళు కడుపులో విషాన్ని తగ్గించుకోండి.. వికారాబాద్ హవా లాఖోం కి దావా.. వారు గుర్తించుకోవాలని సీఎం రేవంత్ సూచించారు.