Telangana Congress Operation: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్ జోరు పెంచింది. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు మరో ప్రతిపక్షం బీజేపీలో అసంతృప్తులు, అసమ్మతులకు వల వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఒకవైపు అభ్యర్థుల ఖరారు కోసం భేటీలు నిర్వహిస్తూ.. ఖాళీగా ఉన్న స్థానాలు, బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతల కోసం అన్వేషిస్తోంది. ఇలా కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ గాలానికి ఎందరో నేతలు చిక్కుతున్నారు? అసలు బీఆర్‌ఎస్ (BRS Party), బీజేపీ (BJP) టార్గెట్‌గా కాంగ్రెస్ చేస్తున్న ఆపరేషన్ (operation akarsh) ఏంటి?
నేతల అవుట్ గోయింగ్ గాని.. ఇన్‌కమింగ్ లేక కునారిల్లిపోయిన కాంగ్రెస్‌కు.. ఇప్పుడు నేతల తాకిడి ఎక్కువవుతోంది. అధికార బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఎ చంద్రశేఖర్ (A Chandrashekar) బీజేపీకి బైబై చెప్పి.. హస్తం గూటికి చేరేందుకు రెడీ అయిపోయారు. చిరకాలంగా ప్రత్యర్థులుగా ఉన్న నేతలతోనూ చేయి కలిపి.. వచ్చే ఎన్నికల్లో చావోరేవో తేల్చేస్తానని ప్రకటించారు చంద్రశేఖర్.
ఆయనతో కాంగ్రెస్ నేతలు టచ్‌లోకి వెళ్లిన 24 గంటల్లోనే బీఆర్‌ఎస్‌కు షాక్ ఇస్తూ నాగర్ కర్నూల్ ఎంపీ రాములు (P Ramulu) అనుచరులతో భేటీ అయ్యారు. అచ్చంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని కోరుకుంటున్న రాములు.. బీఆర్‌ఎస్‌లో ఆ చాన్స్ లేకపోవడంతో కాంగ్రెస్‌ను ఆప్షన్‌గా ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ సీనియర్ నేత అయిన రాములు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తోంది. అధికార పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం.. అందునా ఈ మధ్య జోరు చూపిస్తున్న కాంగ్రెస్‌ను ఎంచుకోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది.
Also Read: కాంగ్రెస్‌లో చేరిన మరింత మంది బీఆర్ఎస్ నేతలు.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
ఇక ఇదే ఊపులో బీజేపీలో ఉన్న సీనియర్ నేత.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) మళ్లీ సొంతగూటికి వచ్చేస్తారనే టాక్ కూడా హాట్ హాట్‌గా మారింది. రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరతారంటూ ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలోనే ప్రకటించినా.. ఇంతవరకు అలాంటి సంకేతాలు ఏవీ కనిపించలేదు. కానీ, చంద్రశేఖర్ చేరిక తర్వాత ఈ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈయన భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేతలు మహేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read: ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఈ ప్రయోగం ఎందుకు.. సూర్యం అంగీకరిస్తారా?
కాంగ్రెస్‌లో చేరతామంటూ మహేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి పేర్లు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నా.. ఇప్పటివరకు వారిద్దరూ ఖండించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏ క్షణంలోనైనా ఈ ఇద్దరు కాంగ్రెస్ ఖండువా కప్పుకుంటారని హస్తం పార్టీ తెగ ప్రచారం చేయడం గులాబీ దళాన్ని గందరగోళానికి గురిచేస్తోంది. అదేవిధంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ నేత యెన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఈటల ముఖ్య అనుచరుడు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read: మళ్లీ కేసీఆర్ వస్తే.. ఒంటి మీద బట్ట కూడా మిగలదు- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరిక
ఎన్నికలు దగ్గరపడుతున్నా.. కాంగ్రెస్‌లో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉందనే టాక్ ఒకటుంది. ఇలాంటి చోట్ల కొత్తగా వస్తున్నవారితో పోటీ చేయిస్తామని హామీ ఇస్తుండటంతో బీఆర్‌ఎస్, బీజేపీ అసమ్మతులు, అసంతృప్తులు తమ నెక్ట్స్ స్టెప్ కాంగ్రెస్‌గా ఎంచుకుంటున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో కాని.. ఎన్నికల ముందు మాత్రం వలసలను ప్రోత్సహిస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌ను చురుగ్గా నడిపిస్తోంది.