Telangana Congress Protest Delhi: తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 10టీవీతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్లకోసం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపాము. మూడు నెలలైన స్పందన లేదు. ఇది దురదృష్టకరం. బీసీ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చాం. రాష్ట్రపతిని కూడా కలుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో ఆమోదించిన బీసీలకు 42శాతం బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. సభలో ఒకలా, బయట ఒకలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లుకు మద్దతిస్తారు.. కానీ కలిసి రండి అంటే రారు. బీసీలపై ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ది లేదని భట్టి విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హరీశ్ రావు కామెంట్స్ సరికాదు. చట్టబద్ద వ్యవస్థలపై కామెంట్ చేయడం సరికాదని భట్టి విక్రమార్క సూచించారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం, పార్టీ చిత్తశుద్దితో ముందుకెళ్తుంది. తమిళనాడు మాదిరి 9 షెడ్యూల్డ్ మార్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే మా డిమాండ్. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రామచంద్రరావుతోపాటు ఆ పార్టీ నాయకులు రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారు. బీజేపీలోని బీసీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదంటూ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
అరవింద్, ఈటల, బండి సంజయ్ ఏం చేస్తున్నారు..? అసలు మీకు బీసీలపై ప్రేమ ఉందా..? బీసీలపై బీజేపీకి కనీస ప్రేమ లేదు. చిత్తశుద్ది ఉంటే బిల్లుకు ఆమోదం తెలపాలి. బీఆర్ఎస్ సీన్‌లోనే లేదు. కనీసం ఇప్పటికైనా కవిత బీసీ రిజర్వేషన్లపై మాట్లాడటం సంతోషం. రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతామని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.