Telangana corona woman delivered three babies : దురదృష్టంలో అదృష్టం అంటే ఇదేనేమో అనేలా కరోనా పాజిటివ్ తో బాధపడే ఓ గర్భిణి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. వివాహం జరిగి నాలుగేళ్లు గడిచినా ఇంకా పిల్లలు పుట్టకపోవటంతో ఎంతో ఆవేదన చెందారు. దీంతో IUI (Intrauterine insemination)ద్వారా యత్నించారు. వారి కలలు ఫలించి ఆమె గర్భందాల్చింది. కానీ కరోనా కాలంలో గర్భిణీ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాగానీ పాపం ఆమెను కరోనా మహమ్మారి వదల్లేదు. కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె అల్లాడిపోయింది.
నా కడుపులో పెరిగే నా బిడ్డల పరిస్థితి ఏంటానీ..పుట్టాక వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందోనని మధనపడిపోయింది. అలా నెలలు నిండాయి. కానీ అదృష్టం కొద్దీ ఆమె నాలుగేళ్ల ఆకాంక్షలకు ముగ్గురు పండంటి బిడ్డలు పుట్టారు. వారికి కరోనా నెగిటివ్ రావటంతో డాక్టర్లతో పాటు ఆమె వారి కుటుంబ సభ్యులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషకరమైన వార్తకు వేదిక తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ జరిగింది.
వివరాల్లోకి వెళితే..ఎడపల్లి మండలానికి చెందిన ఓ మహిళకు (కరోనా బాధితుల పేరు వెల్లడించకూడదు ) వివాహమై నాలుగేళ్లు అయింది. అయినా పిల్లలు పుట్టలేదు. దీంతో వారు IUI (Intrauterine insemination) ట్రీట్ మెంట్ ద్వారా గర్భం దాల్చింది. ఇటీవల అనారోగ్యం బారినపడడంతో గత నెల 21 ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోగా..ఆమెకు కరోనా కూడా చేయించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భంతో ఉంది.
ఆ తర్వాతి రోజే ఆమె పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఉమ్మనీరుతోపాటు కరోనా కారణంగా ఆమె పరిస్థితి విషమించినట్టు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేయి బిడ్డలను బైటకు తీశారు. తల్లికి కరోనా పాజిటివ్ కావటంతో శిశువులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ చేసారు.
ఆమెకు ఇద్దరు మగ పిల్లలు, ఓ ఆడ శిశువు జన్మించగా, వీరిలో ఇద్దరు 1.2 కిలోల బరువుతో పుట్టగా, ఒకరి బరువు 1.5 కిలోలు ఉంది. దీంతో వైద్యులు వారిని ఎస్ఎన్‌సీయూకు తరలించి చికిత్స అందించారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో శిశువులకు కరోనా నెగటివ్ అని తేలడంతో డాక్టర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడాహాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
అలాగే బుధవారం (నవంబర్ 4,2020) తల్లికి కూడా మరోసారి కరోనా పరీక్షలు చేయగా ఆమెకు కూడా నెగటివ్ అని రావడంతో అందరినీ డిశ్చార్జ్ చేశారు. తమ బిడ్డలు పుట్టిన వేళా విశేషమే తనకు నెగిటివ్ వచ్చిందని ఆ తల్లి తన ముగ్గురు బిడ్డలను చూసుకుని మురిసిపోతోంది.