Boycott Polling: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు పోలింగ్ బహిష్కరించి నిరసన తెలిపారు.
రోడ్డు వేసేవరకు ఓటు వేయం
నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపెల్లిలో గ్రామస్తులు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇళ్ల నుంచి ఓటర్లు బయటకు రాకపోవడంతో ఉదయం 10 గంటల వరకు ఒక్క ఓటు పోల్ కాలేదు. గ్రామంలో రోడ్డు నిర్మాణం చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదని, అందుకే పోలింగ్ బహిష్కరిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఊరికి రోడ్డు వేసేవరకు ఓటు వేయొద్దని గ్రామస్తుల తీర్మానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండంలో మాన్కాపూర్ లో ఓటు వేసేందుకు గ్రామస్తులు నిరాకరించారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమని స్పష్టంచేశారు.
తడిసిన ధాన్యాన్ని కొంటేనే ఓటు వేస్తాం
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. నిన్న గ్రామంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ధర్నాకు దిగారు. తమకు స్పష్టమైన హామీ ఇస్తే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి రైతులు నిరసన తెలిపారు.
కోడిచర్ల తాండా వాసుల నిరసన
తమ ఊరిలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదన్న కారణంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కోడిచర్ల తాండా వాసులు ఓటు వేయడానికి నిరాకరించారు. గతంలో కూడా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాలేదని వారు వాపోయారు. తమకు బస్సు సౌకర్యం కూడా లేదని, తమ తాండాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న కొత్తూరు ఎమ్మార్వో తాండా ప్రజలకు రాబోయే ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీయివ్వడంతో వారు నిరసన విరమించారు.
Also Read: నేను జాతీయ వాదిని.. మోదీ గెలుస్తారో, లేదో తెలియదు: అసదుద్దీన్ ఒవైసీ
కరెంట్ లేదు.. ఓటు వేయం
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెం వాసులు ఓట్లు వేయకుండా పోలింగ్ బహిష్కరించారు. గత మూడు రోజుల నుంచి కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి లేదని వారు వాపోయారు. చెంచుగూడెం వాసులు పోలింగ్ బహిష్కరించడంతో విద్యుత్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.