Telangana elections 2023
Telangana elections 2023: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తో ఇవాళ హైదరాబాద్‌లో కేంద్ర ఎన్నికల సంఘ బృందం భేటీ అయింది. డిప్యూటీ కమిషనర్ నితీశ్ వ్యాస్ తో పాటు మరో ఇద్దరు అధికారుల ఇందులో పాల్గొన్నారు.
తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఓటరు లిస్టులో చేర్పులు, తీసివేతలపై కేంద్ర ఎన్నికల బృందం సూచనలు చేసింది. జూన్ 1 నుంచి ఏవీఎంలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. కాగా, తెలంగాణలోని 119 నియోజక వర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరులోగా జరగాల్సి ఉంది.
తెలంగాణలో బీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మూడో సారి కూడా అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై సాధారణంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. దాన్ని బాగా వాడుకోవాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే అనధికారికంగా ఎన్నికల ప్రచార హడావుడి మొదలైంది.
తెలంగాణలో రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో ఆ పార్టీ బలం పెరిగింది. టీపీీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. వైఎస్సార్టీపీ, బీఎస్పీ, టీజేఎస్, వామపక్ష పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి సారించాయి.