Schools Timings : ఉ.11.30 గంటల వరకే స్కూళ్లు, ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8 గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 24 నుంచే వేస‌వి సెల‌వులు..(Schools Timings)

School Timings

Schools Timings : ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు భగభగ మండిపోతూ నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండవేడికి జనాలు విలవిలలాడిపోతున్నారు. మార్చి నెలలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ముందు ముందు ఎలా ఉంటుందోనని తలుచుకుని బెంబేలెత్తిపోతున్నారు.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. కుమురంభీమ్‌ జిల్లాలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాఠశాల విద్యాశాఖ అలర్ట్ అయ్యింది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది.(Schools Timings)

ఇక నుంచి తెలంగాణలో స్కూళ్లు ఉదయం 11.30 గంటల వరకే నడుస్తాయి. గురువారం నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8 గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కుదించిన వేళలు ఏప్రిల్‌ 6 వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒంటిపూట బడులు మొదలయ్యాయి.

మరోవైపు తెలంగాణ‌లో పాఠ‌శాల విద్యార్థుల‌కు ఏప్రిల్ 24 నుంచే వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. వాస్త‌వానికి మే నెల‌లో టెన్త్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు ముగిసిన త‌ర్వాత వేస‌వి సెల‌వులు ఇచ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందినా.. రోజురోజుకీ ఎండ వేడి పెరిగిపోతున్న‌ నేప‌థ్యంలో ఏప్రిల్ 24 నుంచే పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ బుధ‌వారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Telangana Temperature: తెలంగాణలో ఎండల తీవ్రతపై జిల్లా కలెక్టర్లకు సి.ఎస్. సోమేశ్ కుమార్ కీలక ఆదేశాలు

ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఏప్రిల్ 7 నుంచే 1 నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌రీక్షా ఫ‌లితాల‌ను 23లోగా విడుద‌ల చేయ‌నున్నారు. ఆ మ‌రునాటి నుంచే అంటే.. ఏప్రిల్ 24 నుంచే సమ్మర్ హాలిడేస్ మొద‌లు కానున్నాయి. భారీగా పెరిగిన ఎండ వేడిమి నేపథ్యంలో ఇప్ప‌టికే మొద‌లైన ఒంటిపూట బ‌డుల‌ను కూడా గురువారం నుంచి ఉద‌యం 11.30 గంట‌ల‌కే ముగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న ప్రభుత్వం ఆ వెంట‌నే వేస‌వి సెల‌వుల‌పైనా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. తీవ్ర ఎండల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు సీఎస్. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కవ అవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అధికారులతో చెప్పారు. సరిపడా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలని సీఎస్‌ కలెక్టర్లకు సూచించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఉపాధిహామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలన్నారు.

కాగా, రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.