Ration Cards
Ration Cards: రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేసుకున్న వారికి బిగ్ అప్‌డేట్. రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక, కార్డుల జారీ, సన్న బియ్యం పంపిణీ తదితర విషయాలపై ప్రభుత్వం కీలక విషయాలను వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే, ఈ ఏప్రిల్ చివరి నాటికి అర్హులైన వారికి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతుంది.
ఉగాది పండుగ రోజు రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా కార్డులు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైనా.. లబ్ధిదారుల జాబితాలో పేరుంటే చాలు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. దీంతో లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
Also Read: LRS Scheme: ఎల్ఆర్ఎస్ గడువు మరో నెల పొడిగింపు..? ఈసారి ఫీజు రాయితీలో కోత..
రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, ప్రజావాణి, మీ- సేవ కేంద్రాల్లో సుమారు 18లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో కూడా రేషన్ కార్డులు లేనివారు వివరాలను వెల్లడించారు. అయితే, ఇప్పటి వరకు 1.26 లక్షల మంది లబ్ధిదారును మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొత్త కార్డులు జారీ చేయలేదు. అయితే, ఏప్రిల్ చివరి నాటికి పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక, కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
రేషన్ కార్డుల విషయంపై పూర్తిస్థాయి కసరత్తు తరువాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కసరత్తు పూర్తయితే మొత్తం ఐదు లక్షల నుంచి ఐదున్నర లక్షల కుటుంబాల ఎంపిక పూర్తవుతుంది. కానీ, దరఖాస్తుల సంఖ్యకు, ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్యకు పోల్చిచూస్తే చాలా తేడా ఉంది. సుమారు 10లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే, ఇందులో 50 నుంచి 55శాతం వరకే కార్డులు పంపిణీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.