LRS Scheme: ఎల్ఆర్ఎస్ గడువు మరో నెల పొడిగింపు..? ఈసారి ఫీజు రాయితీలో కోత..
LRS ఓటీఎస్ గడువును ఈనెలాఖరు వరకు పొడగించాలని ప్రభుత్వం భావిస్తుండగా.. ఈసారి కొన్ని పరిమితులు విధించేందుకు సిద్ధమవుతోన్నట్లు..

LRS Scheme
Telangana LRS Scheme: లే అవుట్ల క్రమబద్దీకరణ (ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఈసారి గడువు పెంచినప్పటికీ.. చెల్లించాల్సిన ఫీజు రాయితీ 25 శాతం కాకుండా తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎల్ఆర్ఎస్ పథకాన్ని 2020లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పట్లో జారీచేసిన ఉత్తర్వుల ఆధారంగా చేసుకున్న దరఖాస్తుదారులకు 25శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకూ దాదాపు 4లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకూ ఫీజు చెల్లించారు. అయితే, ఈ పథకం అమలు చేసిన తరువాత కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు వీటిని పరిష్కరించే లోపు గడువు సమయం సమీపించింది. దీనికితోడు వరుస పండుగల నేపథ్యంలో చివరి రెండు రోజులు కార్యకలాపాలు మందగించాయి. దీంతో గడువు పొడిగించాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: HCA Vs SRH : మా పరువుకు భంగం కలిగించొద్దు, చర్చలకు సిద్ధం- ఎస్ఆర్ హెచ్ ఆరోపణలను ఖండించిన హెచ్ సీఏ
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు ఎల్ఆర్ఎస్ ఓటీఎస్ గడువును ఏప్రిల్ చివరి నాటికి పొడిగించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికితోడు ప్రభుత్వానికిసైతం ఆశించిన స్థాయిలో రెవెన్యూ రాకపోవటంతో మరోసారి గడువును పొడగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి కొన్ని పరిమితులను విధించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మొత్తం చెల్లించాల్సిన ఫీజులో 25శాతం రాయితీ ఇస్తుండగా.. ఇకపై మొదటి 15రోజులు అంటే ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ రాయితీని 15శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఆ తరువాత 15రోజుల్లో రాయితీని పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, గడువు పొడగింపు.. పరిమితులపై అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. ఇవాళ లేదా రేపు ఎల్ఆర్ఎస్ ఓటీఎస్ గడువు పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.