HCA Vs SRH : మా పరువుకు భంగం కలిగించొద్దు, చర్చలకు సిద్ధం- ఎస్ఆర్ హెచ్ ఆరోపణలను ఖండించిన హెచ్ సీఏ
అంగీకరించిన తర్వాత హెచ్‌సీఏ నిర్దిష్ట కోటాలోని మిగులు పాసులు ఇవ్వాల్సిన వ్యవహారాన్ని మీరు తప్పుడు విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే అర్థంతో ఈ-మెయిల్‌లో పేర్కొనడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.

HCA Vs SRH : ఐపీఎల్ టికెట్లు, పాసుల వివాదంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. ఐపీఎల్ పాసుల కోసం ఎస్ఆర్ హెచ్ ను వేధించినట్లు వచ్చిన ఆరోపణలను హెచ్ సీఏ ఖండించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. హెచ్‌సీఏ పరువుకు భంగం కలిగించేలా చేయడం సబబు కాదంది. కోటాకు మించి అదనపు పాసులు హెచ్‌సీఏ ఎప్పుడూ అడగలేదంది.
హెచ్‌సీఏ పరువుకు భంగం కలిగించేలా చేయడం మంచి పద్ధతి కాదంది. ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కొన్ని సమస్యలున్నా మేము మౌనంగా ఉంటున్నామని హెచ్ సీఏ తెలిపింది. హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యుల పట్ల ఎస్ఆర్‌హెచ్ ఉద్యోగ బృందంలోని కొందరు వ్యవహరించిన అమర్యాదపూర్వకమైన తీరు వల్లే ఈ సమస్యలు వచ్చాయంది. ఇప్పటికైనా ఈ-మొయిల్స్‌కి స్వస్తి చెప్పి, ఎస్ఆర్‌హెచ్ జట్టు యాజమాన్యం, సిబ్బంది హెచ్‌సీఏతో కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కరించకోవచ్చని సూచించింది.
”ఎస్ఆర్‌హెచ్‌తో చర్చలు జరిపేందుకు హెచ్‌సీఏ కార్యవర్గం సిద్ధంగా ఉంది. హెచ్‌సీఏకు గత రెండు మ్యాచ్‌లకు ఎస్ఆర్‌హెచ్ ఇచ్చింది 3,880 కాంప్లిమెంటరీ పాసులే. అవి కూడా మీరు హెచ్‌సీఏ కోసం ఇచ్చింది. కోశాధికారి సీజే శ్రీనివాస్‌కు గాని అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుకు కాదు. ఎఫ్-12 ఏ బాక్సులో సామర్థ్యానికి మించి మీరు 50 టిక్కెట్లు ఇస్తామంటే, మేము ఆ బాక్సులో 30 ఇచ్చి మిగిలిన 20 పాసులు మరో బాక్సులో సర్దుబాటు చేయమన్నాం.
ఈ నెల 27న ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవాణన్, రోహిత్ సురేష్ అందుకు అంగీకరించారు. హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్‌తో జరిగిన ఈ భేటీలో అసలు పాల్గొనని శ్రీనాథ్ ఆ తర్వాత ఈ విధమైన ఆరోపణలు చేయడం బాధాకరం. ఎస్ఆర్‌హెచ్ సీఈఓ, ఇతర ప్రతినిధులు మా వాట్సాప్, మెసేజ్‌లు, ఈమొయిల్స్‌కు ప్రతి స్పందించడం లేదని పలుమార్లు మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మీ దృష్టికి తీసుకొచ్చాం. ఎఫ్-12 ఏ బాక్సులో సామర్థ్యానికి మించి ఇస్తున్న టిక్కెట్లను వేరే దగ్గర ఇచ్చేందుకు మీరు సామరస్యంగా అంగీకరించారు.
అంగీకరించిన తర్వాత హెచ్‌సీఏ నిర్దిష్ట కోటాలోని మిగులు పాసులు ఇవ్వాల్సిన వ్యవహారాన్ని మీరు తప్పుడు విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే అర్థంతో ఈ-మెయిల్‌లో పేర్కొనడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇక, మీ తదుపరి ప్రధాన ఆరోపణ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు మరో 10 శాతం టిక్కెట్లు ప్రతి మ్యాచ్‌కు బ్లాక్ చేయమన్నారని ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
Also Read : SRH కు వేధింపులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కీలక ఆదేశాలు జారీ
అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తన వ్యక్తిగత అవసరాల కోసం ఆ 10 శాతం టిక్కెట్లు బ్లాక్ చేయమని ఎస్ఆర్‌హెచ్‌ను ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేస్తున్నాం. హెచ్‌సీఏ క్లబ్ సెక్రటరీలకు ఉచిత పాసులు సరిపోక డబ్బులు పెట్టి కొనుగోలు చేసేందుకు అవకాశమివ్వాలని హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ గత నెల 19వ తేదీ ఎస్ఆర్‌హెచ్‌ను కోరింది. అందుకు మీరు అంగీకరించారు. అయితే ఆ మొత్తం హెచ్‌సీఏ అకౌంట్ నుంచి చెల్లించమని మీరు అడగ్గా, సెక్రటరీలు ఎవరికి వారు వ్యక్తిగతంగా చెల్లిస్తారని మేము చెప్పాం.
ఆ టిక్కెట్ల కేటాయింపు పెండింగ్‌లోనే ఉండగా, అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తన వ్యక్తిగత అవసరాల కోసం మిమ్మల్ని 2500 టిక్కెట్లు బ్లాక్ చేయమని అడిగినట్టు ఆయనకు దురుద్దేశాలు ఆపాదించడం సమంజసం కాదు. స్టేడియం ఆధునీకరణ పనులు విషయానికొస్తే స్టేడియంలో సీట్లు మార్చే క్రమంలో మీరు ఆరెంజ్ రంగు సీట్లు వేయించాలని జస్టిస్ నాగేశ్వరరావుని అప్పట్లో కోరారు. అందుకు అయ్యే ఖర్చును సీఎస్ఆర్ నిధుల కింద మీరు రూ.8 – 10 కోట్లు పెట్టుకుంటామని చెప్పారు. ఆ మాటను నిలుపుకోలేదు. ఆ విషయమై మేము తాజా సీజన్‌లో స్టేడియంలో చేపట్టబోయే కొన్ని అభివృద్ధి పనులకు సహకరించాలని సన్ నెట్ వర్క్ ఎండీకి లేఖ రాశాం.
అందుకు సానుకూలంగా స్పందించి, స్టేడియంకు రంగులు వేసే పని, కార్పొరేట్ బాక్సుల ఆధునీకరణ పనులు మీరు చేపట్టగా, కొత్త ఏసీల కొనుగోలు, అమర్చడం హెచ్‌సీఏ చేపట్టింది. మీరు చేస్తున్న పనులకు సంబంధించిన వివరాలు, ఆ పనులకు సంబంధించి ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు? ఏం పనులు చేస్తున్నారు? అని మేము ఎన్నిసార్లు అడిగినా మీ నుంచి జవాబు రాలేదు. ఇప్పటివరకు జరిగిన రాద్ధాంతాన్ని పక్కనపెట్టి విశాల దృక్పథంతో ముందున్న సమస్యల పరిష్కారానికి హెచ్‌సీఏతో చర్చలకు ముందుకు రావాలని కోరుతున్నాం”.