SRH కు వేధింపులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కీలక ఆదేశాలు జారీ
ఎస్ఆర్ హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరించారు.

Cm Revanth Reddy : హెచ్ సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఐపీఎల్ పాసులు, ఉచిత టికెట్ల కోసం ఎస్ఆర్ హెచ్ యాజమాన్యాన్ని వేధించిన అంశంపై సీఎం రేవంత్ ఆరా తీశారు. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశించారు. సన్‌రైజర్స్‌ను HCA ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవమా కాదా తేల్చాలన్నారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీకి ఆదేశాలిచ్చారు. విచారణ బాధ్యతను విజిలెన్స్ హెడ్ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి అప్పగించారాయన.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్ అయ్యారు. ఎస్ఆర్ హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఐపీఎల్ టికెట్లు, పాసుల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్, హెచ్ సీఏ మధ్య వివాదం నడుస్తోంది. ఎస్ఆర్ హెచ్ టీమ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్.. హెచ్ సీఏ ట్రెజరర్ శ్రీనివాస్ రావుకు మెయిల్ పంపారు. అందులో చాలా అంశాలు ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల ఉచిత పాసుల కోసం హెచ్ సీఏ.. ఎస్ఆర్ హెచ్ మేనేజ్ మెంట్ ను ఇబ్బంది పెడుతోందని, వేధిస్తోందని, బ్లాక్ మెయిల్ చేస్తోందని మెయిల్ లో వాపోయారు.
దాదాపు 10శాతం పాసులు అంటే 3వేల 900 ఉచిత పాసులు ఇచ్చినా.. ఇంకా కాంప్లిమెంటరీ పాసులు కావాలని ఒత్తిడి చేస్తున్నారని, అడిగినన్నీ టికెట్లు ఇవ్వలేదని మ్యాచ్‌కు ముందు కార్పొరేట్ బ్యాక్స్ కి తాళం వేసి వేధించారని మెయిల్ లో తెలిపారు. ఈ వ్యవహారం బయటకు వచ్చి దుమారం రేగడంతో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
Also Read : హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత.. 400 ఎకరాల భూమి వ్యవహారంలో వివాదం ఏమిటి..? ప్రభుత్వం ఏం చెప్పింది..
హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరు ఉందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఎం రేవంత్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు విజిలెన్స్ డీజీగా ఉన్న కొత్త కోట శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించినా, పాసుల కోసం ఎస్ఆర్ హెచ్ యాజమాన్యాన్ని వేధించినా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ రాసిన లేఖ బయటకు రావడం సంచలనంగా మారింది. పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని, ఇలా అయితే తాము హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లిపోతామని ఆయన లేఖలో హెచ్చరించారు. ఐపీఎల్ ఉచిత టికెట్ల కోసం హెచ్‌సీఏ నుంచి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైందని ఆరోపిస్తూ హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్ లేఖ రాసింది.
ఈ లేఖలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసింది. కోరినన్ని పాస్ లు ఇవ్వనందుకు ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్ కు తాళాలు వేసినట్లు సన్‌రైజర్స్ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.
”ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలో హెచ్‌సీఏకు 10శాతం (3వేల 900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ, ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్ లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై చర్చిద్దామని చెప్పాం. మేము స్టేడియానికి అద్దె చెల్లిస్తున్నాం.
Also Read : షాకింగ్.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు ఎంతగా పెరిగాయంటే? ఏయే వాహనానికి ఎంతెంత..
ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోనే ఉంటుంది. కానీ, గత మ్యాచ్ సందర్భంగా ఎఫ్-3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తేగానీ తెరవమంటూ బెదిరించారంటూ” ఆ లేఖలో పేర్కొన్నారు ఎస్ఆర్ హెచ్ జనరల్ మేనేజర్.