HCU Land Issue: హెచ్​సీయూలో మళ్లీ ఉద్రిక్తత.. 400 ఎకరాల భూమి వ్యవహారంలో వివాదం ఏమిటి..? ప్రభుత్వం ఏం చెప్పింది..

హెచ్ సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్శిటీ భూమి లేదని చెప్పింది.

HCU Land Issue: హెచ్​సీయూలో మళ్లీ ఉద్రిక్తత.. 400 ఎకరాల భూమి వ్యవహారంలో వివాదం ఏమిటి..? ప్రభుత్వం ఏం చెప్పింది..

HCU Land Issue

Updated On : March 31, 2025 / 3:49 PM IST

HCU Land Issue: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శి (హెచ్ సీయూ) భూములకు సంబంధించిన వ్యవహారం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని ఆదివారం చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవటంతో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో అసలు హెచ్ సీఏ భూముల వివాదం ఏమిటి..? విద్యార్థులు ఎందుకు ఆందోళనకు దిగారు..? ప్రతిపక్ష పార్టీల నేతలు ఏమన్నారు..? ప్రభుత్వం ఏం చెబుతుంది అనే విషయాలను తెలుసుకుందాం..

భూముల వేలాన్ని అడ్డుకుంటాం..
హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ ఆవ‌ర‌ణంలో భూమి వేలంపై వివాదం కొన‌సాగుతుంది. 400 ఎక‌రాల భూమిని రాష్ట్ర మౌలిక స‌దుపాయాల సంస్థ‌కు కేటాయిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థ‌ల‌కు విక్ర‌యించేందుకు టీజీఐఐసీ ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. అయితే, ఈ భూములు హెచ్‌సీయూకి చెందిన‌వి అని.. జీవ‌వైవిద్యం ఉన్న వీటి జోలికి రావొద్ద‌ని విద్యార్థి సంఘాలు ఆందోళ‌న చేస్తున్నాయి. భూముల వేలాన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ అడ్డుకుంటామ‌ని విద్యార్థి సంఘాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వర్శిటీ భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ రకాల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు (రాక్స్) ఉన్నాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్దెత్తున ఉద్య‌మిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆదివారం టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని ఆదివారం చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు.

Also Read : షాకింగ్‌.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు ఎంతగా పెరిగాయంటే? ఏయే వాహనానికి ఎంతెంత.. వివరాలు? 

ప్ర‌తిపక్ష నేతలు ఏమన్నారంటే..
భూముల వేలాన్ని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్‌ ఇప్ప‌టికే ఖండించ‌గా.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఈ విష‌యాన్ని కేంద్ర‌ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హెదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఈ రాష్ట్రానికి తలమానికం. హెచ్ సీయూ భూములు అమ్మి అప్పులు కట్టాలని నీచమైన ఆలోచనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. స్మశాన వాటికలకు, పార్కులకు జాగా లేకుండా పోతున్న రోజులివి.. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి దుర్మార్గ నిర్ణయాలు తీసుకుంటుందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల పోలీసుల తీరును ఖండించారు. 2016లో రోహిత్ వేముల మరణం సమయంలో విద్యార్థుల బాధను చెబుతూ యూనివర్శిటీలోకి వచ్చిన రాహుల్ గాంధీ, ఇప్పుడు అదే క్యాంపస్ పై వారి పార్టీ ప్రభుత్వం దాడులు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

అప్పట్లో ప్రైవేట్ సంస్థకు కేటాయింపు.. రద్దు..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి గ్రామం స‌ర్వేనంబ‌ర్ 25లోని 400 ఎక‌రాల భూమిని 2004 జ‌న‌వ‌రి 13వ తేదీన నాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడా వ‌స‌తుల అభివృద్ధి కోసం ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. ఐఎంజీ అక‌డ‌మీస్ త‌న ప్రాజెక్టును ప్రారంభించ‌క‌పోవ‌డంతో 2006 న‌వంబ‌రు 21న ప్ర‌భుత్వం ఆ కేటాయింపును ర‌ద్దుచేసింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల ఐఎంజీ అక‌డ‌మీస్ అదే సంవత్సరం హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ న్యాయ‌పోరాటం సుదీర్ఘ కాలం కొన‌సాగింది. అయితే, 2024 మార్చి 7వ తేదీన ఈ కేసులో హైకోర్టు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఆ తరువాత హైకోర్టు తీర్పుపై ఐఎంజీ అకడమీస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా 2024 మే3న ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఆ త‌రువాత‌.. టీజీఐఐసీ విజ్ఞ‌ప్తి మేర‌కు శేరిలింగంప‌ల్లి డిప్యూటీ క‌లెక్ట‌ర్, త‌హ‌శీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం కంచె గ‌చ్చిబౌలిలోని 400 ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించారు. త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ భూమి హ‌క్కుల‌ను టీజీఐఐసీకి బ‌ద‌లాయిస్తూ గ‌తేడాది ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అయితే, ఆ భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థ‌ల‌కు విక్ర‌యించేందుకు టీజీఐఐసీ ప్ర‌ణాళిక సిద్ధం చేసింది.

Also Read : MS Dhoni : సీఎస్‌కేకు భారంగా మారాడా ? ధోని బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై స‌ష్టత నిచ్చిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌..

ప్రభుత్వం ఏం చెప్పిదంటే?
హెచ్ సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్శిటీ భూమి లేదని చెప్పింది. ఆ భూమి యాజమాని తామేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుందని, ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని తెలిపింది. వేలం, అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవు, అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్) లేదు సర్వేలో ఒక అంగుళం భూమికూడా హెచ్ సీయూది కాదని తేలిందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.