Telangana Govt : రైతులకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ సర్కార్.. ఆ పథకం బంద్.. ఆందోళనలో అన్నదాతలు..

Rythu Bima : తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రతిష్ఠాత్మక రైతు బీమా పథకంకు ఎండ్ కార్డ్ పడింది.

Telangana Government Premium Due for Rythu Bima Scheme

Telangana Rythu Bima: తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రతిష్ఠాత్మక రైతు బీమా పథకంకు ఎండ్ కార్డ్ పడింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీతో బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ సర్కార్ ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక నుంచి రైతు బీమా పథకంకు ఎండ్ కార్డు పడినట్లయింది.

Also Read : పోలీస్‌ అభ్యర్థులకు శుభవార్త.. వయోపరిమితి పెంపు.. సర్కార్ ఉత్తర్వులు జారీ..

రైతు బీమా పథకం కింద 18 నుంచి 59ఏళ్ల వయస్సు కలిగిన రైతులు సహజ మరణం, ప్రమాదవశాత్తూ మరణించినా ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 42.16లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. వీరి తరఫున ప్రభుత్వం ప్రతి ఏడాది సగటున సుమారు రూ.1,400 కోట్ల వరకు ప్రీమియం చెల్లిస్తోంది. రైతుల నుంచి ప్రత్యేకంగా ప్రీమియం వసూలు చేయకుండా ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తోంది. అయితే, ప్రస్తుతం 2026-27 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం బీమా సొమ్మును చెల్లించలేదు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..

రైతులకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ జీవిత బీమా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తుంది. ఈ మేరకు గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. 2026-27 వార్షిక బడ్జెట్ లో రూ.4వేల కోట్ల నిధులను కూడా కేటాయించింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో ఈ పథకంను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, పథకం మాత్రం ప్రారంభం కాలేదు. ఈ పథకం గురించి ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నవంబర్ 19వ తేదీ నుంచి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక, వివరాల నమోదు కోసం ఇంటింటి సర్వే చేపడతామని అన్నారు. కుటుంబ యాజమానికి లేదా ఇంటి బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తికి రూ.5లక్షలు బీమా చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే రైతు బీమాకు ప్రభుత్వం స్వస్తి పలికినట్లు తెలుస్తోంది.

రైతుల్లో ఆందోళన..

రైతు బీమా పథకం నిలిచిపోవటంతో రైతుల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు కావడానికి మరో మూడు నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో మరణించే రైతు కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతు బీమా ప్రీమియంను ప్రభుత్వం చెల్లించకపోవటంతో ఇకనుంచి రైతుబీమా సొమ్ము రాదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభమయ్యే వరకు రైతు బీమాను కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.