తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధం అయ్యింది. రేపటి(సెప్టెంబర్ 1,2020) నుంచే డిజిటల్ బోధన ప్రారంభం కానుంది. క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా వేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బోధనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది.
దూరదర్శన్ యాదగిరి, టీశాట్ వంటి చానళ్ల ద్వారా పాఠాలు ప్రసారం:
కొవిడ్-19 నేపథ్యంలో నేరుగా స్కూళ్లకు విద్యార్థులను అనుమతించ లేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఆదేశాలతో విద్యాశాఖ ఆన్‌లైన్ పాఠాలకు టైం టేబుల్‌ను తరగతులు, సబ్జెక్టులవారీగా విడుదల చేసింది. దూరదర్శన్ యాదగిరి, టీశాట్ వంటి చానళ్ల ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్ పాఠాలు ప్రసారం మొదలు పెడుతున్నారు. అందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆన్ లైన్ క్లాసులపై గ్రామాల్లో ప్రచారం:
3 నెలల విరామం తర్వాత స్కూళ్లకు వచ్చిన హెడ్ మాస్టర్లు, టీచర్లు, గ్రామస్థుల భాగస్వామ్యంతో డిజిటల్ పాఠాల టైం టేబుల్ గురించి ఇంటింటికి వెళ్లి చెప్పడమేగాక గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఈ మేరకు డిజిటల్ పాఠాలు వినేలా తల్లిదండ్రులు తమ పిల్లలను సంసిద్ధులను చేస్తున్నారు. టీవీలు లేని విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు.
అన్ లాక్ 4లోనూ స్కూల్స్, కాలేజీలు బంద్:
కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని నెలలు గడిచాయి. అన్ లాక్ 4 లోనూ విద్యా సంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) తెరవడానికి కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలో స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో అనే క్లారిటీ లేదు. కాగా, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం స్కూల్స్ ఓపెన్ చేయడం లేదు కానీ, ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్ లైన్ క్లాసుల ప్రారంభం కానున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఏకంగా స్కూల్స్ ఓపెన్ చేస్తామని జగన్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం మరోసారి సమాలోచనలు జరుపుతోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్స్ ఓపెన్ చేయడం ఎంతవరకు సేఫ్ అనే దానిపై డిస్కస్ చేస్తున్నారు.