Ts Govt
Telangana: తెలంగాణలో రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏ పోస్టులు ఏ పరిధిలోకి వస్తాయనే అంశాన్ని అందులో ప్రకటించింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం క్యాడర్ పోస్టుల విభజన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. వివిధ హోదాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ల కింద విభజించింది.
ఆఫీస్ సబార్డినేట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లా కేడర్ కింద గుర్తించగా.. సీనియర్ అసిస్టెంట్, ఆపై పోస్టులు జోనల్ కేడర్ కింద, జిల్లాస్థాయి అధికారులు, ఇతర పోస్టులను మల్టీజోనల్ కేడర్ కింద పరిగణించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే కొన్నిశాఖల్లో పక్కపక్క జిల్లాలను, పక్కపక్క జోన్లను కలిపి యూనిట్లుగా ఏర్పాటు చేసి పలురకాల పోస్టులను యూనిట్ల పరిధిలోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం.
పెండింగ్‌లో ఉన్న ప్రాంతాలను కలిపేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చేశాయి. దీంతో మిగిలి ఉన్న జోన్‌లకు పరిష్కారం కూడా లభించింది. అన్ని సమస్యలు పరిష్కారం కావడంతో.. 50వేల ఉద్యోగుల భర్తీకి చర్యలు చేపడుతోంది తెలంగాణ సర్కార్. ఖాళీ ఉన్న వాటిని భర్తి చేసేందుకు క్యాడర్ పోస్టుల విభజన చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబ్‌ఆర్డినేట్, డ్రైవర్ పోస్టులను జిల్లా క్యాడర్ పోస్టులుగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మిగిలిన వాటిని జోనల్, మల్టీజోనల్ పోస్టులుగా గుర్తించింది ప్రభుత్వం.
ఏ పోస్టు ఏ కేటగిరి కిందకు వస్తుందో.. క్యాడర్ విభజన జరిగింది. జీఓ 84లో అందుకు తగ్గట్టుగా ఉత్తర్వులను విడుదల చేసింది. కొన్ని లోకల్ క్యాడర్ పోస్ట్‌లు జోనల్ పోస్ట్‌లుగా మారాయి. అదేవిధంగా స్టేట్ క్యాడర్ పోస్ట్‌లు మల్టిజోనల్ పోస్ట్‌లుగా మారిపోయాయ్. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయా శాఖల్లో క్యాడర్ సంఖ్య నిర్ణయం జరుగుతుంది. క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా ప్రస్తుతమున్న ఉద్యోగులను ఆయా శాఖల్లో కేటాయింపు చేసి.. కొత్త పోస్ట్‌ల గుర్తింపు జరుగుతుంది. ఆ తర్వాత ఖాళీలపై స్పష్టత వస్తుంది. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు రానున్నాయి.