Godavari Pushkaralu: తెలంగాణలో గోదావరి పుష్కరాలు.. ప్రభుత్వం భారీ ఏర్పాట్లు.. మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు
తెలంగాణ లో గోదావరి పుష్కరాలను(Godavari Pushkaralu) అత్యంత వైభవంగా, గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది.
- V Santhosh Kumar
- Updated on- August 30, 2026 / 10:18 PM IST
Telangana government grand preparations for godavari pushkaralu
- గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
- నదీ తీర దేవాలయాల అభివృద్ధి
- భక్తులకు అత్యాధునిక మౌలిక వసతులు
Godavari Pushkaralu: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు సర్కార్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. సాధారణంగా గోదావరి పుష్కరాలు అంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రే గుర్తుకు వస్తుంది. కానీ ఈసారి తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక విశిష్టత, ఆతిథ్యం ఉట్టిపడేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పర్యవేక్షణను వేగవంతం చేసేందుకు గాను హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రత్యేక అధికారుల కార్యాలయాన్ని, కంట్రోల్ రూమ్‌ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
దేవాలయాల అభివృద్ధి, మౌలిక వసతులు:
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాసర నుంచి భద్రాచలం వరకు నదీ తీరప్రాంతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నారు. పుష్కర స్నానాలకు(Godavari Pushkaralu) వచ్చే కోట్లాది మంది భక్తుల సౌకర్యార్థం నూతన ఘాట్ల నిర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, రవాణా వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే అనేక పనులు ప్రారంభం కాగా, కొన్ని టెండర్ల దశలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
శాఖల సమన్వయంతో వేగంగా పనుల పూర్తి:
ఉత్సవాలను దిగ్విజయం చేయడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్తమ ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది.
