అగ్రకులాల్లో పేదలకు అద్భుత అవకాశం.. వాళ్లకు కూడా రాజీవ్ యువ వికాసం..

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అగ్రవర్ణ పేదలకు..

CM Revanth Reddy

TG Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, ఇటీవల బడ్జెట్ లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లను కేటాయించింది.

 

రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన యువకులకు ప్రభుత్వం రూ.4లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది నిరుద్యోగులు లబ్ధిచేకూరుతుందని ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా.. ఈ పథకంకు అగ్రకులాల్లోని పేదలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది.

 

రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. యూనిట్లను నాలుగు రకాలుగా విభజించి, రాయితీ నిధులను పెంచింది. గతంలో ఉన్న స్వయం ఉపాధి పథకాల కంటే ఇది చాలా మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈబీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు.

 

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అగ్రవర్ణ పేదలకు కూడా అవకాశం కల్పించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ పథకం దరఖాస్తు తేదీని ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించాలని రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ఉపాధిలేక తీవ్ర నిరాశలో ఉన్న పేద యువతీ, యువకులందరికీ ఈ పథకం ద్వారా ఎంత మేలు జరుగుతుందని రవీందర్ రెడ్డి తెలిపారు.