Anganwadi jobs
Anganwadi jobs : తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో అంగన్వాడీల్లో 15,274 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. నియామక విధానంలో మార్పులపై దృష్టిసారించింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా పోషకాహారం పంపిణీ, పూర్వప్రాథమిక విద్య వంటి కీలక సేవలు సక్రమంగా అందడం లేదు. సహాయకులు లేకపోవడంతో పోషకాహారం అందించడంలో సమస్యలు, అలాగే టీచర్లులేని చోట విద్యార్థులకు ప్రాథమిక విద్య అందడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అంగన్వాడీల్లో ఖాళీల వివరాలను సేకరించి.. మొత్తం 15,274 ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. ఇందులో టీచర్లు 2,999 ఖాళీలు ఉండగా.. సహాయకులు 12,275 ఖాళీలు ఉన్నాయి.
అంగన్వాడీ నియామక విధానంలో మార్పులపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులోభాగంగా అంగన్వాడీ సిబ్బంది నియామకానికి దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను శిశు సంక్షేమ శాఖ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఆయా రాష్ట్రాల్లో విద్యార్హతలు, ఎంపిక విధానంపై అధికారులు అధ్యయనం చేశారు. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత నియామక విధానంలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది.
నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉంది. త్వరలో ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియామకాలు పూర్తయితే అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగుపడి, చిన్నారులకు పోషకాహారం, విద్య మెరుగ్గా అందే అవకాశాలు ఉన్నాయి.