Rythu Bharosa Scheme
Rythu Bharosa: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వానాకాలం సీజన్‌లో పెట్టుబడి సాయంకోసం అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు చేయనుంది. ఇప్పటికే రైతు భరోసా పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను వ్యవసాయశాఖ అధికారులు ఆర్థికశాఖకు అందజేశారు. ఎకరంలోపు, ఎకరం, రెండు, మూడు, నాలుగు, ఐదెకరాలు.. ఆపైన ఎకరాలవారీగా రైతుల వివరాలను అందులో పేర్కొన్నారు. వీరందరికీ రేపటి (16వ తేదీ) నుంచి దశలవారీగా అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.
పంట పెట్టుబడి సహాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.12వేలు రైతులకు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వానాకాలం పంట పెట్టుబడి సహాయం కింద ఎకరాకు రూ.6వేలు రేపటి నుంచి రైతుల అకౌంట్లలో దశలవారిగా ప్రభుత్వం జమ చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో 1.52కోట్ల ఎకరాలకు గాను 69లక్షల మంది రైతులు ఉన్నారు. అయితే, గత యాసంగి సీజన్ లో కేవలం నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి రాష్ట్ర రైతాంగానికి ఒకే దఫాలో నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రైతులందరికీ రైతు భరోసా పూర్తిగా విడుదల చేయాలంటే 9వేల కోట్లు అవసరం. రేపు రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్శిటీ వేదికగా రైతు నేస్తం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖిగా మాట్లాడనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై రెండు రోజుల క్రితం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం పండ్ల తోటలు పెంచే వారికి కూడా రైతు భరోసా ఇచ్చే ఆలోచన చేస్తుందని తెలిపారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు నేస్తం కార్యక్రమ నిర్వహణకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రైతులను సమీకరించాలని నిర్ణయించారు. 1,500 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు 250 మంది చొప్పున రైతులను ఆహ్వానిస్తున్నారు.