Telangana Government
Telangana Govt : తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలు పంపిణీ రెండో విడత కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది.
Also Read : హైదరాబాద్‌లో రెస్టారెంట్ లో తీగలాగితే.. దేశంలో రూ.70,000 కోట్ల స్కాం.. బయటపడిందిలా..
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి పురస్కరిం చుకుని ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీలర పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 65లక్షల మంది మహిళలకు సెర్ప్ ద్వారా చీరలను పంపిణీ చేశారు. పట్టణ ప్రాంతాలలోని సుమారు 35లక్షల మంది మహిళలకు చీరలను అందజేయాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందుగా దాదాపు ఐదు లక్షల చీరలను పంపిణీ చేసి ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేసిన విషయం తెలిసిందే.
పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయాల్సిన 35లక్షల చీరలను రెండో విడతలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు మెప్మా అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో ఐదు లక్షలు చీరలు పంపిణీ చేయగా.. ప్రస్తుతం 30లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు.
ముందుగా స్వయం సహాయక మహిళా గ్రూపులకు మాత్రమే చీరలను అందజేయాలని ప్రభుత్వం భావించింది. ఆ తరువాత 18ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు చీరలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ చీరలను ప్రభుత్వమే నేరుగా చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తోంది.
రాష్ట్రంలోని సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండతోపాటు పలు జిల్లాల్లో తయారు అయిన ఈ చీరలు ఒక్కొక్కటి సుమారు రూ.480ల వ్యయం అవుతుందని సమాచారం. దీంతో రెండు దశల్లో కోటి మంది మహిళలకు అందజేసే ఈ చీరలకు దాదాపు రూ.320 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ చీరల పంపిణీ ద్వారా సుమారు 6వేలకుపైగా చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తున్నట్లు తెలుస్తోంది.