Telangana Govt : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు టెట్రాప్యాక్‌లలో పాలు సరఫరా..
Telangana Govt : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతులు చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం సమయంలో పాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయ డెయిరీకి ఆర్డర్ ఇచ్చింది.
- Harishth Thanniru
- Published On : April 9, 2026 / 08:00 AM IST
Telangana Govt
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలు
- విజయ డెయిరీకి రూ.120 కోట్ల ఆర్డర్
- టెట్రా ప్యాకెట్లలో పాలు సరఫరా
Telangana Govt : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పౌష్టికాహారం అందించేలా దృష్టిపెట్టింది. ఈ క్రమంలో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ మేరకు కార్యాచరణ మొదలుపెట్టింది.
ఇటీవల విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పాలు అందించే బాధ్యతను విజయ డెయిరీకి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో.. విజయ డెయిరీ నుంచి ప్రతిపాదనలు కోరారు. తాజాగా.. తొలి విడతగా రూ.120కోట్ల ఆర్డర్ ఇచ్చిన అధికారులు.. జూన్ పాఠశాలలు తెరిచే నాటి నుంచి పాలు సరఫరా చేయాలని ఆదేశించారు.
1వ తరగతి నుంచి 12వ తరగతులు చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం సమయంలో నిత్యం 150 మిల్లీలీటర్ల నుంచి 200 మిల్లీ లీటర్ల వరకు పాలు అవసరమని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిబంధనలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం విద్యార్థులకు 150 మిల్లీ లీటర్లు లేదా 200 మిల్లీ లీటర్ల పాలను టెట్రా ప్యాకెట్లలో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విజయ డెయిరీ అధికారులు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భిణీలు, బాలింతలకు విజయ డెయిరీ 200 మిల్లీ లీటర్ల టెట్రాప్యాక్‌లలో పాలను అందిస్తోంది. వీటితోపాటు ఇటీవలె ములుగు జిల్లా పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోని మూడేళ్ల నుంచి ఐదేళ్ల చిన్నారులకు 100 మిల్లీలీటర్ల పాలను టెట్రా ప్యాక్ లలో విజయ డెయిరీ ఇవ్వడం ప్రారంభించింది. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మిగిలిన గిరిజన ప్రాంతాలకు.. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్న పిల్లలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
