Government Employees
Government Employees : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై సర్కార్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో సంచలన మార్పులు తీసుకొచ్చింది. ఏడాదికిపైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే విధంగా రూల్స్‌లో పలు సవరణలు చేసింది.
Also Read : Uttar Pradesh: Pwd కోటాలో ఎంబీబీఎస్ సీటు కోసం కాలు నరుక్కున్న విద్యార్థి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇష్టారీతిన, వేళాపాళ లేకుండా వచ్చిపోవడం, ఇష్టం వచ్చినట్లు సెలవులు పెట్టడం ఇకపై కుదరదని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు గత మార్గదర్శకాల్లో మార్పులు (సవరణలు) చేసింది. నిబంధనల్లోని సివిల్ సర్వీసెస్ రూల్స్ లో రూల్ 9, రూల్ 25కి సవరణలు చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఏడాదికిపైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఐదేళ్లకు మించి నిరంతర గైర్హాజరు అయితే సేవల నుంచి తొలగించే విధంగా సవరణ జరిగింది. అయితే, ఇలాంటి చర్యలు తీసుకునే ముందు సదరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.
ప్రతీయేటా కొందరు ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడం, కొందరు కేసుల్లో ఇరుక్కొని విచారణల పేరుతో డుమ్మా కొట్టడం, మరికొందరు విదేశాల్లోని పిల్లల వద్దకు వెళ్లడం జరుగుతుంది. కొందరు కనీసం సెలవులను పొడిగించుకునే యోచన కూడా చేయని పరిస్థితి. ఇక మరికొందరు ఇష్టంలేని పోస్టుల్లో, నాన్ ఫోకల్‌లకు బదలీలు అయినప్పుడు ఇలా సెలవులు పెట్టడం పరిపాటిగా మారింది. ఇంకొందరు ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రభుత్వం లేనప్పుడు దీర్ఘకాలం సెలవులో ఉండి కొత్తగా తాము అనుకున్న ప్రభుత్వం కొలువుదీరగానే వచ్చి జాయిన్ అవుతారు. అలాంటి వాటికి చెక్ పెట్టేలా నిబంధనల్లో ప్రభుత్వం మార్పు చేసింది.