Increase Land Prices : తెలంగాణలో భూముల ధరల పెంపు లేనట్లే!

తెలంగాణలో భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ల్యాండ్‌ వాల్యూ సవరించి భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ప్లాన్‌ చేస్తోంది.

plans to increase land prices : తెలంగాణలో భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ల్యాండ్‌ వాల్యూ సవరించి భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ప్లాన్‌ చేస్తోంది. కానీ, సర్కార్‌ ఆశలకు గండికొడుతున్నాయి కొన్ని సవాళ్లు. మరి ఆ సవాళ్లేంటి..? ఉమ్మడి రాష్ట్రంలో 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం భూముల ధరల్ని పెంచింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ల్యాండ్‌ రేట్లు భారీగా పెరిగాయి. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులు పూర్తయి సాగునీటి సరఫరా పెరగడంతోపాటు 33 జిల్లాల్ని ఏర్పాటు చేయడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

ఒకప్పుడు లక్షల్లో ఉన్న రేట్లు ఇప్పుడు కోట్లకు చేరాయి. కానీ, 2013 నాటి రిజిస్ట్రేషన్‌ విలువే కొనసాగడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం తప్పట్లేదు. దీంతో భూముల విలువ సవరించి ఆదాయం పెంచుకోవాలని కేసీఆర్‌ సర్కార్‌ భావించింది. ప్రస్తుత ధరలతో 10వేల కోట్ల ఆదాయం వస్తుండగా… ల్యాండ్‌రేట్లు పెంచితే ఇన్‌కమ్‌ డబుల్‌ అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం కసరత్తు చేయాలని రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ శాఖ‌ల్ని ఆదేశించింది. అయితే త్వరలోనే భూములు విలువ సవరణకు రెడీ అవుతున్న ప్రభుత్వానికి కొత్త స‌వాళ్లు అడ్డంకిగా మారాయి.

తెలంగాణలో చాలా ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. ఫార్మా సిటీ, రిజిన‌ల్ రింగ్ రోడ్డు ముఖ్యమైనవి. ఇవి కాకుండా చిన్నాచిత‌క ప‌రిశ్ర‌మ‌లకు భూసేక‌ర‌ణ పూర్తి కాలేదు. ఆసియాలోనే అతి పెద్దదైన ఫార్మా సిటీకి మొత్తం 18 వేల 304 ఎక‌రాలు అవసరం కాగా.. మొద‌టి ద‌శ ప‌నుల కోసమే 9 వేల 212 ఎక‌రాలు సేకరించాల్సి ఉంది. టీఎస్ఐఐసీ ఆధీనంలో 6 వేల 719 ఎక‌రాల భూములున్నాయి. అంటే.. మొదటి దశ పూర్తి చేయడానికే ప్రైవేట్ ల్యాండ్స్‌ సేక‌రించాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీని ఎత్తిపోసేందుకు సిద్ధమ‌వుతున్న ప్ర‌భుత్వం… దానికి కూడా భూసేక‌ర‌ణ చేపట్టాల్సి ఉంది.

ఇక దేశంలోనే అతి పెద్ద‌దైన రిజిన‌ల్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌ చుట్టూ రాబోతోంది. 340 కిలోమీటర్ల పొడవున్న నిర్మించే ట్రిపుల్‌ ఆర్‌కు సుమారు 3వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో రేపోమాపో భూసేక‌ర‌ణ‌ మొద‌లు పెట్టాల్సి ఉంది. ఇందుకోసం 2వేల కోట్ల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ల్యాండ్‌ వాల్యూ పెంచితే… రీజినల్‌ రింగ్‌రోడ్డు భూసేకరణ ఖర్చు తడిసిమోపెడయ్యే అవకాశముంది. అలాగే ఫార్మా సిటీ భూసేక‌ర‌ణలోనూ ప్రభుత్వంపై ఆర్థికభారం పెరగనుంది.

మొత్తానికి ఆదాయం కోసం భూముల విలువ పెంచితే… భూసేకరణ ఖర్చు భారీగా పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీంతో కీలక ప్రాజెక్టుల భూసేకరణ పూర్తయ్యేదాకా ధ‌ర‌ల్ని పెంచ‌కపోవ‌డ‌మే బెట‌రన్న ఆలోచ‌న‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు