తెలంగాణలో తగ్గిన ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల ధర

  • Publish Date - November 19, 2020 / 10:43 AM IST

RT-PCR tests price Reduce : తెలంగాణలో కరోనా నిర్ధారణకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల ధరలను సర్కారు భారీగా తగ్గించింది. ఇక నుంచి ఆ టెస్టుకు ప్రైవేటు ల్యాబ్‌లు 850 వసూలు చేయాలని ఆదేశించింది. ఇంటివద్దే పరీక్ష నిర్వహిస్తే 1200 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 50 వరకు ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు.



జూన్‌ 15 నుంచి రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబ్‌లలోనూ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ జీవోలో ల్యాబ్‌ వద్ద నమూనాలు సేకరిస్తే 2200, ఇంటివద్దే అయితే 2800 వసూలు చేయాలని నిర్దేశించింది. ఇప్పుడీ ధరలను తగ్గిస్తూ సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది.



https://10tv.in/who-is-the-future-woman-mayor-lobbying-that-started-in-trs/
చాలావరకు ప్రైవేటు ల్యాబ్‌లు సర్కారు నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువగానే వసూలు చేస్తున్నాయి. పీపీఈ కిట్ల పేరు చెప్పి 2800 వరకు ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు వసూలు చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆర్టీపీసీఆర్‌ కిట్ల తయారీ భారీగా పెరగడంతో వాటి ధరలు నేలకు దిగాయి. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ కిట్‌ ధర 200కు చేరుకోగా, రీఏజెంట్‌ ధర 50 నుంచి 60కు చేరాయి. దీంతో మొత్తం కిట్‌ 250కే లభిస్తోంది.



ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్‌ దేశవ్యాప్తంగా ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు 950 మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మన రాష్ట్రంలో మాత్రం నిన్నటి వరకు ఆర్టీపీసీఆర్‌కు 2500 నుంచి 3వేల మధ్య వసూలు చేస్తున్నారు. ఐసీఎంఆర్‌ ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధరలు తగ్గించాలని ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం ఆ మేరకు జీవో జారీ చేసింది