Cheyutha Pensions: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త.. కొత్తగా 4.63 లక్షల ‘చేయూత’ పింఛన్లు మంజూరు.. నవంబర్ 19న నేరుగా ఖాతాల్లోకి!
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ‘చేయూత(Cheyutha Pensions)’ పించన్ల నగదు నవంబర్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కానుంది.
- V Santhosh Kumar
- Published on- November 16, 2026 / 06:51 AM IST
Telangana government sanctioned new cheyutha pension to 4 63 lakh beneficiaries amount credit on november
Cheyutha Pensions: తెలంగాణలోని నిరుపేదలు, ఆసరా కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా ‘చేయూత(Cheyutha Pensions)’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి పింఛన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అర్హులకు మంజూరు పత్రాలను వేగంగా అందజేస్తున్నారు. నవంబర్ 18వ తేదీ నాటికి ఈ పత్రాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందిరా గాంధీ జయంతి రోజున నేరుగా ఖాతాల్లోకి నగదు:
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీన కొత్త లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా (DBT పద్ధతిలో) మొదటి నెల పింఛన్ సొమ్మును జమ చేయనున్నారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయగా, ఆర్థిక శాఖ సైతం అవసరమైన అదనపు నిధులను విడుదల చేసింది. కొత్తగా మంజూరైన 4,63,857 పింఛన్లలో అత్యధికంగా 2,77,894 మంది వితంతువులు ఉండగా, 1,00,224 మంది దివ్యాంగులు, 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు ఉన్నారు.
45 లక్షలకు చేరిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య.. ఆధార్ సీడింగ్ తప్పనిసరి:
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40.44 లక్షల మంది సామాజిక భద్రతా పింఛన్లు పొందుతుండగా, తాజాగా కొత్త లబ్ధిదారుల చేరికతో రాష్ట్రంలో మొత్తం పింఛన్‌దారుల సంఖ్య దాదాపు 45 లక్షల మార్కును తాకింది. అయితే, ప్రభుత్వం విడుదల చేసే పింఛన్ నగదు ఎలాంటి సాంకేతిక ఆటంకాలు లేకుండా ఖాతాల్లో జమ కావాలంటే, లబ్ధిదారులందరూ తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ (NPCI లింకింగ్) పూర్తయ్యేలా వెంటనే చూసుకోవాలని అధికారులు ప్రత్యేకంగా సూచిస్తున్నారు.
