CM Revanth Reddy
Telangana Govt: తెలంగాణలోని రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందాకకూడా కాంట్రాక్టు పద్దతిలో కీలక పదవుల్లో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 6,729 మందిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం తొలగించిన జాబితాలో మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వైస్ చైర్మన్ జి.కిషన్ రావుతోపాటు కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్ఎన్ రెడ్డికూడా ఉన్నారు. పది మంది ట్రాన్స్ కో, జెన్ కో డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఖాళీ అవుతున్న స్థానాల్లో కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఉద్యోగాలు భర్తీ చేయడం, పదోన్నతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలుసైతం జారీ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: తెలంగాణలో తాటి, ఈత కల్లుతో వైన్ తయారీ పరిశ్రమ.. సీఎం రేవంత్ రెడ్డితో జర్మన్ ప్రతినిధి భేటీ
ప్రభుత్వ ఉత్తర్వులతో మునిసిపల్ శాఖ వెంటనే చర్యలను ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం 6,729 మందిని తొలగించిన నేపథ్యంలో గ్రూప్-1 నుంచి గ్రూప్-4 స్థాయిలో కొత్త నోటిఫికేషన్ల ద్వారా భర్తీకి అవకాశాలున్నాయని సచివాలయవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల పెద్దెత్తున ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.