తెలంగాణలో తాటి, ఈత కల్లుతో వైన్ తయారీ పరిశ్రమ.. సీఎం రేవంత్ రెడ్డితో జర్మన్ ప్రతినిధి భేటీ
తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లుతో వైన్, అరక్ తదితర అనుబంధ పదార్థాల తయారీ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని..

German representative Stephen meets CM Revanth Reddy
Making wines with Thati kallu: ఈత, తాటి కల్లు రెండు ప్రాచీనకాలం నుంచి భారతదేశంలో ప్రత్యేకంగా వినియోగంలో ఉన్న పానియాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తాటి, ఈత కల్లు వినియోగం ఎక్కువ. వీటిని తాగడం వల్ల రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈత, తాటి చెట్ల నుంచి కల్లును గీస్తూ గీత కార్మికులు అనేమంది ఉపాధి పొందుతున్నారు. అయితే, వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా గత ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. తాజాగా. గీత కార్మికులు ఆర్థికాభివృద్ధి సాధించేలా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది.
తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లుతో వైన్, అరక్ తదితర అనుబంధ పదార్థాల తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ తెలిపారు. గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్టీఫెన్ కలిశారు. తెలంగాణలో తాటి, ఈత కల్లుతో వైన్స్ , అరక్ తదితర అనుబంధ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. అదేవిధంగా వాల్యూ అడిషన్, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. అంతేకాక.. తెలంగాణ కల్లు యూరప్ కు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుందని, స్థానికంగానూ వాటి ఉత్పత్తులు విక్రయాలు చేపట్టొచ్చునని తెలిపారు. తాటి, ఈత మొక్కలు త్వరగా పెరిగి అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల తయారుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి స్టీఫెన్ వివరించారు.
ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రొఫెసర్ జానయ్యలు కాంబోడియా స్టడీ టూర్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ఈత, తాటి కల్లు ద్వారా వైన్ తయారు చేసే పరిశ్రమను వారు పరిశీలించారు. ఈ పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఆర్థికంగా ఉపాధి కల్పిస్తున్న అంశాన్ని గుర్తించారు. దీంతో తెలంగాణలోనూ ఇలాంటి పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని ఆ సమయంలో స్టీఫెన్ తో సమావేశమై వారు కోరారు. మంత్రి పొన్నం విజ్ఞప్తి మేరకు జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. తాటి, ఈత కల్లుతో వైన్, అరక్ తదితర అనుబంధ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, అందుకు అవకాశం కల్పించాలని కోరాడు.