Telangana Govt : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త.. సర్కార్ కీలక ప్రకటన..
Rajiv Yuva Vikasam Scheme : రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల్లోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
- Harish Thanniru
- Published on- September 29, 2026 / 07:25 AM IST
Telangana Govt
Rajiv Yuva Vikasam Scheme : రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల్లోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సర్కార్.. రాజీవ్ యువ వికాసం పథకంతో యువత స్వయం ఉపాధి పొందేలా చర్యలను వేగవంతం చేసింది.
యువత తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే, నవంబర్ నెల నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం కింద ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని, అర్హత కలిగిన యువతకు మాత్రమే ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని విద్యార్థులకు సంబంధించి సుమారు 1.80 లక్షల మందికి రూ.450 కోట్ల నిధులను నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా.. విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌లు, ఇతర సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు కావాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. కాటమయ్య రక్షణ కవచాల పథకానికి రూ.60కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 50 వేల మందికి కిట్లు మంజూరు కాగా, 40 వేల కిట్లను లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి కూడా శిక్షణ పూర్తయిన తర్వాత రక్షణ కవచాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని బీసీ గురుకుల విద్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. విద్యార్థులకు అందించే డైట్, కాస్మోటిక్ ఛార్జీలను ప్రతి నెలా నిర్ణీత సమయంలోనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు.
