BC Overseas Education Scheme
BC Overseas Education Scheme: బీసీ విద్యార్థులకు మేలు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లే బీసీ విద్యార్థులకు ఉపకార వేతనం అందించేలా గతంలో రూపొందించిన బీసీ విదేశీ విద్య పథకాన్ని మళ్లీ గాడిలో పెట్టే ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీ విదేశీ విద్య పథకానికి లబ్ధిదారుల ఎంపిక మొదలైంది. ఈ పథకం దాదాపు ఏడాదిన్నరగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ పథకం ఫలాలు బీసీ విద్యార్థులకు అందించేలా బీసీ సంక్షేమశాఖ దృష్టిసారించింది.
గత ప్రభుత్వం ‘మహాత్మా జ్యోతి బాఫూలే విదేశీ విద్యా నిధి’ పేరుతో ఈ పథకాన్ని 2017-18లో ప్రారంభించింది. స్టూడెంట్ వీసా ఉన్నవారికి బీసీ విదేశీ విద్య పథకం కింద ప్రభుత్వం ప్రతీ సంవత్సరం 300 మందికి ఉపకార వేతనాలు అందిస్తోంది. ఫాల్ సీజన్ కు సెప్టెంబరులో దరఖాస్తులు తీసుకొని జనవరిలో, స్ర్పింగ్ సీజన్ కు ఫిబ్రవరి, మార్చిలో దరఖాస్తులు తీసుకొని ఆగస్టు నాటికి అర్హుల జాబితాలను ప్రకటిస్తుంది. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.20లక్షల ఉపకార వేతనంతోపాటు ఒకవైపు విమాన ఖర్చులు అందనున్నాయి.
2023 ఫాల్, 2024 స్ర్పింగ్ సీజన్ లకు కలిపి మొత్తం 6వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఆయా విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తయింది. సీజన్ కు 150 మంది చొప్పున రెండు సీజన్లకు 300 మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, ఏడాదిన్నరగా ఈ పథకం పలు కారణాలతో నిలిచిపోవటంతో.. కొందరు దరఖాస్తుదారులు ఇప్పటికే అప్పులు చేసి విద్య కోసం విదేశాలకు వెళ్లగా.. మరికొందరు ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉపకారవేతనం కోసం ఎదురుచూస్తూ ఇక్కడే ఉండిపోయారు. 2024 ఫాల్ సీజన్ కు కూడా దరఖాస్తులు స్వీకరించినా ఇంకా లబ్ధిదారుల ఎంపిక జరగలేదు.
బీసీ విదేశీ విద్యపై అధికారులు దృష్టిపెట్టారు. ఏడాదిన్నరగా నిలిచిన ఈ ప్రక్రియను మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజులుగా ఎంపిక జాబితాను ఖారారు చేసేందుకు కమిటీ సమావేశం అయింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులతో పాటు ప్రత్యేక కోటా కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే జాబితాపై ప్రభుత్వం ఆమోదం తీసుకొని లబ్ధిదారుల వివరాలను బీసీ సంక్షేమ శాఖ ప్రకటించనుంది.