×
Ad

Job Notification : నిరుద్యోగులకు పండగే.. కొత్త సంవత్సరంలో 50వేల కొలువులు.. త్వరలో 14వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

Job Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త. కొత్త సంవత్సరం 2026లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది.

  • కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు శుభవార్త
  • భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు
  • 14వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

Job Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త. కొత్త సంవత్సరం 2026లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. సరికొత్తగా జాబ్ క్యాలెండర్ రీ షెడ్యూల్ చేసి శాఖల వారీగా ఖాళీలతో నివేదికలను రూపొందిస్తోంది. తాజాగా రిటైర్మెంట్లు పెరగడంతో ఏర్పడిన ఖాళీలను పదోన్నతులతో పాటు, నేరుగా నోటిఫికేషన్లతో నియమించుకోవాలన్న యాక్షన్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దుతోంది.

ప్రైవేట్ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. ప్రభుత్వ రంగంలోనూ ఆయా శాఖల్లోని ఖాళీలను భర్తీకి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల నియామకాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం జనవరి, ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీలో 198 సూపర్ వైజర్ పోస్టులు, పోలీస్ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు, యూనివర్శిటీల నియామకాల్లో జాప్యం, పలు శాఖల్లో కారుణ్య నియామకాలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

పోలీస్ శాఖలో త్వరలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 14వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 14వేల స్టయిపెండరీ క్యాడెట్ కానిస్టేబుళ్లతోపాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని డీజీపీ తెలిపారు. నూతన సంవత్సరంలో దీనికి సంబంధించిన ప్రకటన వెలవడుతుందని ఆయన చెప్పారు.

గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని నిలిపివేసిన ప్రభుత్వ నోటిఫికేషన్లు కొత్త సంవత్సరంలో ఒకదాని వెంట ఒకటి వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణతోపాటు, బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఆ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకొని రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేసి, నియామక ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది.

 ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి..? ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి..? అనే దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఇకపై విడుదలయ్యే నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్ ను అమలు చేయనున్నారు. కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం.. ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వెనుకబడిన తరగతులకు పెద్ద మొత్తంలో అవకాశాలు దక్కనున్నాయి.