KTR
KTR : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ పై చార్జ్‌షిట్ వేసేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి లభించింది. తాజా పరిణామంతో త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. విచారణ తరువాతే ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఫార్ములా ఈ-కారు రేసింగ్ వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ విచారణ సంస్థల ముందు నాలుగు సార్లు హాజరయ్యారు. మరోవైపు కేసులో కీలక నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై డోపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఒకవేళ కేంద్రం అనుమతి ఇస్తే ఆయనపై కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది.
తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైన సమయంలో ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, విచారణ అనంతరం కేటీఆర్ బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పారు. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారని కూడా కామెంట్ చేశారు. వెయ్యిసార్లు విచారణలకు పిలిచినా అరెస్టులు చేసినా తగ్గేదేలేదు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. జైలు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సమయంలో కేటీఆర్ అరెస్టు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను అరెస్టు చేయాలన్నా.. ఆయనపై ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి అని రేవంత్ చెప్పారు. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవటంతోనే కేటీఆర్ అరెస్టు ఆగిందని.. లేదంటే ఇప్పటికే కేటీఆర్ అరెస్టు అయ్యవాడని రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేటీఆర్ అరెస్టు ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఈ కేసు విషయంలో ఏసీబీ ఏ విధంగా ముందుకెళ్తుందనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.