Ponnam Prabhakar: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. 700 ప్రత్యేక బస్సులతో ఆర్టీసీ ధమాకా.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
తెలంగాణలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కీలక నిర్ణయాలు వెల్లడించారు.
- V Santhosh Kumar
- Published on- September 2, 2026 / 08:11 AM IST
Telangana govt announces free power for ganesh mandapam
- గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
- ఏర్పాటైన ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
- మంత్రి పొన్నం సమన్వయ సమీక్ష
Ponnam Prabhakar: తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ పరిసర జిల్లాల అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమన్వయ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
700 ప్రత్యేక బస్సులు.. పటిష్ట భద్రతా చర్యలు:
ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ తరఫున 700 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని మంత్రి ఆదేశించారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడంతో పాటు అవసరమైతే సేవా సమయాన్ని పొడిగించాలని సూచించారు. భద్రత కోసం షీ టీమ్స్, యాంటీ థెఫ్ట్ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఉత్సవాల వేళ 24 గంటల వైద్య శిబిరాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, నిమజ్జన ఘాట్ల వద్ద శిక్షణ పొందిన గజఈతగాళ్లను, లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
పర్యావరణహిత ఉత్సవాలకు పిలుపు:
మండపాలు, ఊరేగింపు మార్గాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని కాలుష్య నియంత్రణ మండలికి సూచించారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ రోడ్ల మరమ్మతులు, పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణ మరియు బేబీ పాండ్ల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
