Anganwadi Retirement : అంగన్వాడీ సిబ్బందికి భారీ ఊరట.. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబుల్.. ఎవరికి ఎంతంటే?
Anganwadi Retirement : తెలంగాణలో అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ రెట్టింపు చేసింది. టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున ప్రయోజనం అందించనుంది.
- Sreehari A
- Updated on- August 18, 2026 / 04:27 PM IST
Anganwadi Retirement
- అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
- 65 ఏళ్ల వయస్సు పూర్తి అయిన సిబ్బందికి డబుల్ బెనిఫిట్స్
- టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష బెనిఫిట్
Anganwadi Retirement : తెలంగాణలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్మెంట్ సమయంలో అందించే సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
కొత్తగా అమలయ్యే నిబంధనల ప్రకారం.. 65 ఏళ్ల వయస్సు పూర్తి అయిన అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున సర్వీస్ ఎండ్ బెనిఫిట్ లభించనుంది. అలాగే, 60 ఏళ్లు దాటాక స్వచ్ఛందంగా వైదొలిగే అంగన్వాడీ సిబ్బందికీ కూడా ఇదే ప్రయోజనం వర్తించనుంది.
కేంద్ర ప్రభుత్వం అందించే మిషన్ సక్షమ్ అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0 మార్గదర్శకాల ప్రకారం.. అంగన్వాడీ సిబ్బంది రిటైర్మెంట్ వయస్సును గరిష్టంగా 65 ఏళ్లుగా నిర్ణయించారు. అదే గతంలో అంగన్వాడీ టీచర్లకు రూ.1 లక్ష, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేలు ఉండేది.
అయితే, ఇప్పుడు ఆ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. పెంచిన బెనిఫిట్స్ ప్రకారం.. అర్హత ఉన్న సిబ్బందికి చెల్లింపులు కూడా మొదలయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,572 మంది అంగన్వాడీ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ కింద మొత్తం రూ.15.61 కోట్లు జమ చేసినట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఈ చెల్లింపుల్లో 473 మంది అంగన్వాడీ టీచర్లకు రూ.4.73 కోట్లు, 1,930 మంది హెల్పర్లకు రూ.9.65 కోట్లు అందాయి. పెంచిన ప్రయోజనాల కింద మరో 14 మంది టీచర్లకు రూ.28 లక్షలు, 59 మంది హెల్పర్లకు రూ.59 లక్షలు చెల్లించారు. పాత నిబంధనల ప్రకారం.. మరో 96 మంది అంగన్వాడీ సిబ్బందికి రూ.36.10 లక్షల బెనిఫిట్స్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
సుదీర్ఘకాలం అంగన్వాడీ సేవలు అందించిన సిబ్బందికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా అండగా, వారికి గౌరవప్రదమైన ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రిటైర్ అంగన్వాడీ సిబ్బందికి కూడా ప్రస్తుత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించినట్లు వెల్లడించింది.
మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హెల్పర్లు, అంగన్వాడీ టీచర్ల నియామక ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ త్వరలో నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది.
