Rain
Telangana Heavy Rainfall : తెలంగాణ రాష్ట్రంలో వానలు కుండపోతగా కురుస్తున్నాయి. మేఘానికి చిల్లు పడిందా అన్నట్లు భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో జిల్లాల వాసులు అవస్థలు పడుతున్నారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణతో పాటు మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.
ఆది, సోమవారాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్భందంలో చిక్కుకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ఇళ్లు నీట మునిగిపోయాయి. రహదారులు, వంతెనలపై భారీగా నీరు ప్రవహిస్తోంది. వీటిపై వెళుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరదలో కొట్టుకపోయి..నలుగురు చనిపోగా మరికొందరు గల్లంతయ్యారు.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. నగరంలో ఆదివార నుంచి వానలు పడుతున్నాయి. వాతావరణం చల్లగా అయిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని ప్రాంతాల్లో ముసురు పడుతోంది. మరికొన్ని రోజులు వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
రోడ్డు మీద కొంచెం నీళ్లు నిలిస్తేనే.. ప్రయాణం కష్టమవుతుంది. వాహనం ఏదైనా సరే… అత్యంత జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఇక రోడ్డు మొత్తం నీటిలో మునిగిపోయి ఉంటే…ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంటే…ఆ దారిలో ప్రయాణించకపోవడమే మంచిది. ప్రయాణం వాయిదా వేసుకోవడమో, తాత్కాలికంగా నిలిపివేసుకోవడమో మంచిది. కానీ నీటి తీవ్రత ఎక్కువగా ఉందని అర్ధం చేసుకోలేకపోవడమో, ఆలస్యమవుతోందన్న ఆలోచనో.. ప్రజలు మోకాలి లోతు నీరు నిలిచిపోయి ఉన్నా ప్రయాణాలు ఆపడంలేదు. ఫలితంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.