Telangana High Court: ఉచిత పథకాలపై ‘తెలంగాణ హైకోర్టు’ తీవ్ర వ్యాఖ్యలు.. ప్రజలను సోమరులను చేస్తున్నారు.. ఇది చాలా ప్రమాదం
ఉచిత పథకాలపై తెలంగాణ హై కోర్ట్ (Telangana High Court)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- V Santhosh Kumar
- Updated on- August 7, 2026 / 02:41 PM IST
Telangana high court sensational comments on free schemes and governance
- ఉచిత పథకాలపై తీవ్ర ఆందోళన
- ఉన్నతాధికారులపై కేసుల భారం
- నిజమైన అర్హులకే లబ్ధి చేకూరాలి
Telangana High Court: సమాజంలో భవిష్యత్ అవసరాలను, పెరుగుతున్న ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ప్రభుత్వ పాలనా తీరు, ఉచిత పథకాల అమలుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలను కోటీశ్వరులు కూడా పొందుతున్నారని, రైతుబంధు వంటి పథకాల వల్ల ధనికులు లబ్ధి పొందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని జస్టిస్ నగేష్ బీమాపాక స్పష్టం చేశారు. ఒకప్పుడు దేశానికి ఏదో ఒకటి చేయాలని ఆలోచించేవారని, కానీ నేడు దేశం మనకేమిచ్చిందనే ధోరణి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితాల వల్ల పల్లెల్లో కూలీలు దొరకక రైతుల పరిస్థితి ఘోరంగా తయారైందని, ప్రజలు పని చేయడమే మానేసే రోజులు వస్తాయని హెచ్చరించారు. కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచితాలు ఇస్తే దేశాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించిన కోర్టు, విద్యార్థుల ఫీజుల చెల్లింపులోనూ కేవలం అర్హులైన, బాగా చదువుకునే వారికి మాత్రమే ఆర్థిక సాయం అందించాలని సూచించింది.
Ayodhya Ram Mandir: అయోధ్య భక్తులకు గుడ్ న్యూస్.. వారికి 10 నిమిషాల్లోనే దర్శనం.. ఇలా చేస్తే చాలు
ప్రభుత్వ విధానాలు, ఉన్నతాధికారులపై పడుతున్న భారం:
ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ఉన్నతాధికారులు బలి అవుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకే సందీప్ సుల్తానియాపై ఏకంగా 3,000 నుంచి 4,000 కేసులు నమోదు కావడం, వందకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ లెక్కన చూస్తే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై ఏమి చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సందీప్ సుల్తానియా మంచి అధికారే అయినప్పటికీ, అనివార్య పరిస్థితుల్లోనే ఆయనను కోర్టుకు పిలిపించాల్సి వస్తోందని కోర్టు పేర్కొంది.
వ్యవస్థల రక్షణకు హెచ్చరికలు:
ఈ వ్యాఖ్యలు ఏ ప్రభుత్వంపైనా విమర్శలు లేదా రాజకీయ ఉపన్యాసాలు కావు అని, కేవలం ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాజంలో మోగుతున్న ప్రమాద ఘంటికలను గుర్తుచేయడానికే చెబుతున్నానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఉచితాలను ఇలాగే ఇస్తూ పోతే చివరకు కుబేరుడి వద్ద ఉన్న ధనమంతా అయిపోయి, ఆయన కూడా పనికి ఆహార పథకం కింద కూలీకి రావాల్సిన పరిస్థితి వస్తుందని సరదాగా చెబుతూనే తీవ్ర హెచ్చరిక చేశారు. ఉచితాల సంస్కృతిని మార్చి, నిజమైన అర్హులకు మాత్రమే సాయం అందుతుండేలా సమగ్రమైన పాలనా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కోర్టు ఉద్ఘాటించింది.
