TG High Court
TG High Court : నారాయణపేట జిల్లా మాగనూర్ హైస్కూల్ లో మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. వారం వ్యవధిలో మూడు సార్లు మధ్యాహ్న భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఇది చాలా సీరియస్ అంశమని తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. వారం రోజుల్లో మూడు సార్లు ఇలా జరిగితే ఏం చేస్తున్నారు..? పిల్లలు చనిపోతే కానీ స్పందించారా..? అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం లేదని హైకోర్టు అభిప్రాయ పడింది. ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ.. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అనడంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: Japanese Man: ఒత్తిడి నుంచి ఉపశమనంకోసం జపాన్ వ్యక్తి వింత ప్రవర్తన.. అరెస్టు చేసిన పోలీసులు
జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని ప్రభుత్వ తరపు న్యాయవాదిని సీజే ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారు. అధికారులకు కూడా పిల్లలున్నారు కదా.. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించింది. భోజన విరామం తరువాత పూర్తి వివరాలు అందిస్తామని ఏఏజీ పేర్కొనడంతో విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.