TS Inter Results: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల హవా.. విద్యార్థుల తల్లిదండ్రులకు కీలక సూచన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

TS Inter Results

TS Inter Results: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 61.68శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. బాలికలు 68.68శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 54.66శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి చెప్పారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in లేదా http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చూడొచ్చు.

ఫస్టియర్‌లో 63.85శాతం ఉత్తీర్ణత ..

ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,33,082 విద్యార్థులు పరీక్షలు రాశారని, వారిలో 2,72,208 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఫస్టియర్‌లో మొత్తం 63.85శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. వీరిలో ఏ-గ్రేడ్‌లో 1.60లక్షల మంది, బి- గ్రేడ్‌లో 68,335 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఫస్టియర్ లో బాలికలు 2,17,454 మంది పరీక్షలు రాశారని, 1,49,723 మంది ఉత్తీర్ణత సాధించారని, మొత్తం 68.85శాతం మంది అమ్మాయిలు పాస్ అయ్యారని అన్నారు. అదేవిధంగా.. 2,15,628 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 1,22,485 మంది అంటే 56.80శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.

సెకండియర్‌లో 67.26శాతం ఉత్తీర్ణత..

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో భాగంగా 67.26శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత‌ సాధించినట్లు మంత్రి తెలిపారు. సెకండియర్‌లో 3,80,920 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా 2,56,241 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఏ-గ్రేడ్‌లో 1,73,061 మంది ఉత్తీర్ణత సాధించారని, బి- గ్రేడ్‌లో 54,776 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. సెంకడియర్‌లో అమ్మాయిలు.. 1,96,528 మంది పరీక్షకు హాజరైతే 1,44,385 మంది అంటే 73.46శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అబ్బాయిలు 1,84,392 మంది పరీక్ష రాయగా.. 1,11,856 మంది అంటే.. 60.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.

ఈ జిల్లాల్లో అధికశాతం ఉత్తీర్ణత.. 

ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 75శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా 72శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా సెకండ్ ఇయర్‌లో ములుగు జిల్లా 85శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, అసిఫాబాద్ 80శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఫెయిల్ అయిన వాళ్ళు ఆందోళన చెందొద్దు..

ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ పరీక్షరాసి ఉత్తీర్ణత సాధించొచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూన్ 4వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి చెప్పారు. తల్లిదండ్రులు ఫెయిల్ అయిన పిల్లలపై సీరియస్ అవ్వొద్దని, సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించేలా వారికి ధైర్యం చెప్పాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాల‌పై ఎవరికైనా డౌట్స్ ఉంటే రీ వెరైఫికేషన్ చేసుకోవచ్చునని చెప్పారు. రేపటి నుంచి రీ కౌంటింగ్, రీ వాల్యూవేషన్ ఉంటుందని మంత్రి చెప్పారు. ఎంసెట్ రాసే వాళ్ళు ఇంటర్మీడియట్ ఫలితాలను పట్టించుకోవద్దని అన్నారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలిగించినట్లు మంత్రి చెప్పారు.

ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వ కళాశాలలో మెరుగ్గా ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వ సెక్టార్‌లోని రెసిడెన్షియల్స్ 92శాతంగా, సోషల్ వెల్ఫేర్ 80కిపైగా ఉత్తీర్ణత ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సెక్టార్‌లో జూనియర్ కాలేజీల్లో 50శాతానికి పైగా ఫలితాలు ఉన్నాయని అన్నారు. జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ పాఠశాలతో పోటీ పడాలని అన్నారు. ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో 46శాతం మాత్రమే ఫలితాలు ఉన్నాయని మంత్రి చెప్పారు.

రేపటి నుంచి సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు.. నవీన్ మిట్టల్

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల సందర్భంగా తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. పిల్లల కోసం తెలిమానస్ హెల్ప్ లైన్ నెంబర్ 14416 పెట్టామని అన్నారు. రేపటి నుంచి రీ కౌంటింగ్, వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజును కూడా రేపటి నుంచి కట్టుకోవచ్చునని చెప్పారు. జూన్ 4వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని అన్నారు. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సాయంత్రం 5 గంటల నుంచి కలర్ ప్రింట్ మెమోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు.